Thread Rating:
  • 10 Vote(s) - 3.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అనిరుద్ర H/o అనిమిష
#25
అనిరుద్ర H/o అనిమిష - 9వ భాగం

పొగలు కక్కే ఇడ్లీ టేబుల్ మీద ఉంది.

“మీకు భర్తగా జాబ్ చేయాలని ఎందుకు అనిపించింది?” అడిగింది అనిమిష.

“మీకు ఉద్యోగం చేయాలని ఎందుకు అనిపించింది?” ఎదురు ప్రశ్న వేశాడు అనిరుద్ర.

"అదేంటి... బ్రతకడానికి జాబ్ కావాలిగా…’

“నాకూ అంతే...”

“మీ క్వాలిఫికేషన్ కు ఏదో ఓ మంచి జాబ్ వస్తుందిగా...” “అంటే భర్త జాబ్ మంచిది కాదని మీ ఉద్దేశమా?”

“నా ఉద్దేశం అది కాదు...” చప్పున అంది అనిమిష.

“మరేమిటి చెప్పండి... ఈ ప్రపంచంలో భర్త ఉద్యోగం చేస్తుంటే ఇంట్లో వుండే భార్యలు చాలామంది ఉన్నారు. ఒక విధంగా వాళ్లు కూడా ఉద్యోగం చేస్తున్నట్టే. వాళ్లను మనం హౌస్ వైఫ్ అంటాం... అంటే ఇంటి పట్టున వుండి చేసే ఉద్యోగం అన్నమాట. నిజానికి హౌస్వైఫ్ అనే మాట పాతబడి, హౌస్ మేకర్ అనే మాట వాడుకలోకి వచ్చింది. అంటే భర్త ఉద్యోగం చేసి సంపాదిస్తే... భార్య మరోలా పని చేసి సంపాదిస్తున్నట్టే... అలాగే భార్య ఉద్యోగం చేస్తే భర్త ఎందుకు హౌస్ హజ్బెండ్గా ఉండకూడదు?”

“ఉండొచ్చు... కానీ అందుకు శాలరీ…”

“వైనాట్... నేను భర్తగా జాబ్ చేస్తున్నందుకు తీసుకుంటున్నాను. కూరగాయలు తెస్తాను. ఇంటి పనులు చేస్తాను. బిల్లులు కట్టి వస్తాను. ఇంటిని నీట్గా ఉంచుతాను”

“ఇలాంటి ఆడ పనులు”

“అదే తప్పు... పనుల్లో ఆడ పని, మగ పని అని ఉండదు. మహా వుంటే మనుష్యులు చేసే పని, జంతువులు చేసే పని అని ఉండొచ్చు”

“ఇదే జీతం మీకు ఎక్కడ చేసినా దొరుకుతుందిగా...”

“దొరుకుతుంది. కానీ జీతంతోపాటు నాకు తృప్తి కూడా ఉండాలిగా. ఈ ఉద్యోగంలో నా భార్యకే చేస్తున్నానన్న తృప్తి... ఎవ్వరూ చేయని ఉద్యోగం చేస్తున్న క్రెడిట్... ఎవరి దగ్గర పడితే వాళ్ల దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు”

“మీ పని నాకు నచ్చకపోతే”

“నన్ను తీసేయవచ్చు. అలాగే నాకు మీ దగ్గర ఉద్యోగం నచ్చకపోయినా వెళ్లిపోతాను. ముందే విడుకుల కాగితాలు రెడీ చేయిస్తాను... నచ్చినంత కాలం నేనీ భర్త ఉద్యోగం చేస్తాను. నచ్చకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు భర్త పోస్టుకు రాజీనామా చేస్తాను. మీరు కూడా... జాబ్లో నుంచి నన్ను తీసేయవచ్చు. ఈ జాబ్ చేయడం చేయించుకోవడం ఇద్దరికీ ఇష్టం వుంటనే ఈ అగ్రిమెంట్...”

“అయితే ఓ కండీషన్... మీరు ‘భర్త'గా జాబ్లో చేరాక మరే ఉద్యోగమూ చేయకూడదు”

“చేయను. కానీ నాకు ఇష్టమొచ్చిన దగ్గరకి వెళ్తాను. సినిమాలు, ఫ్రెండ్స్, హోటల్స్ నా ఇష్టం” -

“ఓకే నేను కూడా అంతే”

"రైట్ ఇంకా...”

“ఇంకా మనం ప్రపంచ దృష్టికి భార్యాభర్తలం. అంతే కానీ ప...” అనిమిష మొహం ఎర్రబడింది.

“చెప్పండి... 'పని కంటిన్యూ చేయండి”

“పడగ్గదిలో...” ఆమె మొహం మరింత ఎర్రబడింది.

“అది వద్దా?” అడిగాడు అనిరుద్ర.

“ఏది...?” మొహాన్ని మరింత ఎర్రగా మార్చి అడిగింది అనిమిష.

“అదే... అదొద్దా...” తల అడ్డంగా ఊపి.

“అలాంటి హోప్స్ పెట్టుకోవద్దు. ఇది కేవలం బిజినెస్సే.

భర్తగా జాబ్ నాలుగ్గోడల బయట చేస్తే చాలు.. లోపల కాదు” అని చెప్పింది.

"రైట్ ఇంకా...”

“మీరు జీతం ఎంత ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు?” “మీరెంత ఇవ్వగలరు?”

“నిజాయితీగా చెప్తున్నాను... మన పెళ్లయితే నాకు వచ్చే జీతం రెట్టింపవుతుంది అంటే ఆరు వేల రూపాయలు పెరుగుతుంది. అందులో సగం మీకు ఇస్తాను. అంటే మీ శాలరీ త్రీ టౌజండ్)

“సారీ... ఆరు నా లక్కీ నెంబర్... ఆరుకు తక్కువైతే చేయను”

“అలా అయితే త్రీ ఫౌజండ్ సిక్స్ హండ్రెడ్ తీసుకోండి” అనిరుద్ర ఓ నిమిషం ఆలోచించి, "రైట్... మరి ఖర్చు…

“హౌస్ రెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ... ఖర్చులన్నీ షేర్ చేసుకుందాం”

“నాకు వారానికోసారి నాన్ వెజ్ తప్పనిసరిగా కావాలి”

“సారీ... నేను నాన్ వెజ్ తినను”

“నేను నా విషయం చెప్తున్నాను”

“నేను తినకుండా ఎలా...”

“నేను వండుకుని తింటాను” అనిమిష ఏమీ అన్లేక “సరే” అంది.

“పెళ్లయ్యాక నేను మిమ్మలి “ఒసే' అనొచ్చా. భార్యను అలా పిలవడం నాకిష్టం”

“అదేం కుదర్దు... కావాలంటే నువ్వు' అని ఏకవచనంతో పిలవచ్చు”

“ఇంకా ఏమైనా కండీషన్స్ ఉన్నాయా?”

“ఏమీ లేవుగానీ... మనిద్దరి మధ్య వున్న ఈ ఒప్పందం మూడో మనిషికి తెలియకూడదు”

“సారీ... మూడో మనిషికి తెలియకుండా వుండడం నా వల్ల కాదు. ఆరో మనిషికి తెలియకుండా చూడగలను”

“అదేంటి?”

“మీ ఫ్రెండ్ కు తెలుసుగా... తను మూడో మనిషి మా ఫ్రెండ్ కు తెలుసు... వాడు నాలుగో మనిషి మా బామ్మకు ఈ విషయం క్లియర్ గా చెప్పాలి. తప్పదు... ఆరో మనిషికి మాత్రం తెలియనివ్వను. మీరు చెప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు”

“సరే... వెంటనే మ్యారేజ్... గుడిలో సింపుల్గా... అన్నట్టు మ్యారేజ్ అయ్యాక నేను మ్యారేజ్ పేరుతో లోన్లు తీసుకుంటాను. వాటి ఇన్స్టాల్ మెంట్స్ నేనే కట్టుకుంటాను... ముందే చెప్తున్నాను”

“మీ ఇష్టం..” భుజాలు ఎగరేసి చేసి అన్నాడు అనిరుద్ర.

టిఫిన్ చేసి కాఫీ తాగి లేచారు. బిల్లు అనిమిషే పే చేసింది.

“కంగ్రాట్స్ అనిరుద్రగారూ... మంచి అమ్మాయిని కొట్టేశారే.. పార్టీ ఇవ్వాలి”

“ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఓకే. అయినా మీరు జాబ్ కొట్టేశారే అనాలి... అమ్మాయిని కాదు.. పైగా మీ ఫ్రెండ్ 'అది' వద్దంది” అన్నాడు అనిరుద్ర.

“అదా...? ఏది?” అంటూ అనిమిష వంక చూసి, “ఏమొద్దన్నావే” అని అడిగింది. అనిమిష మొహం ఇంకా ఎర్రబడింది.

“ఇంటికెళ్లాక అడగండి. ఓసారి ఆలోచించుకోమనండి” చెప్పాడు వాళ్ల ఆటో కదుల్తుండగా.

***

ఒక్క క్షణం షాక్ అయ్యాడు శోభరాజ్. “వ్వా...ట్... మీరు చెప్తోంది నిజమా? మీ పెళ్లా? రేపేనా?” అడిగాడు

“ఇంత సడన్గా పెళ్లేమిటి? దానిక్కూడా నేను కారణం కాదు కదా” అడిగాడు శోభరాజ్.

“ఛఛ... అదేం కాదు సర్... ఎప్పట్నుంచో ప్రేమించుకుంటున్నాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఎవ్వరికీ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్... ఇప్పుడు అవన్నీ సాల్వ్ అయ్యాయి... అందుకే రేపే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. సారీ సర్ మిమ్మల్ని డిజప్పాయింట్ చేస్తే”

శోభరాజ్ అనిమిష వంక చూశాడు. అతని మొహంలో చిన్న బాధావీచిక క్షణంలో మెరుపులా మెరిసి మాయమైంది.

“అదేం లేదు మిస్ అనిమిషా... ప్రేమ ఒక గేమ్.. అందులో ఎవరో ఒకరే గెలుస్తారు. అవతలి వ్యక్తి ఓటమిని స్పోర్టివ్గా తీసుకోవాలి. గెలిచిన వాళ్లను మనస్ఫూర్తిగా అభినందించాలి. అడ్వాన్స్ గా కంగ్రాట్స్... ఈ అకేషన్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవాలి” అంటూ క్యాబిన్లో నుండి బయటకు వచ్చాడు.

అప్పటివరకూ క్యాబిన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న యాంగ్జయిటీలో వున్న స్టాఫ్ ఎక్కడి వాళ్లక్కడే సర్దుకున్నారు.

"మైడియర్ సాఫ్... మీకు స్వీట్ న్యూస్... ముందు స్వీట్స్ తినండి” అంటూ ఆర్ముగం వైపు చూశాడు. ఆర్ముగం స్వీట్ ప్యాకెట్ పట్టుకొచ్చాడు.

“అందరూ స్వీట్స్ తినండి... వేడి వేడి సమోసా తినండి... కాఫీ తాగండి... నేను చెప్పే న్యూస్ వినండి”

స్వీట్స్, సమోసా అందరికీ సర్వ్ చేయబడ్డాయి. శోభరాజ్ ఓసారి గొంతు సవరించు, “ఈ రోజు అనిమిష మనకో స్వీట్ న్యూస్ వినిపించబోతున్నారు...” అంటూ అనిమిషవైపు తిరిగి “మీరు చెప్తారా? నన్నే చెప్పమంటారా?” అని అడిగాడు.

అనిమిష సిగ్గుపడిపోయింది. శోభరాజ్ కొనసాగించాడు. “రేపు మన అనిమిష... మిసెస్ కాబోతున్నారు”

అందరూ ఆశ్చర్యంగా చూశారు. బాసే అనిమిషను పెళ్లి చేసుకోబోతున్నారా? వెంటనే స్టాఫ్లో నుంచి నిఖిత, “కంగ్రాట్స్ సర్” అంది.

శోభరాజ్ ఒక్కక్షణం ఇబ్బందిగా కదిలి, “కంగ్రాట్స్ చెప్పాల్సింది నాక్కాదు... అనిమిషకు కాబోయే శ్రీవారికి... అన్నట్టు మీక్కాబోయే శ్రీవారి పేరేమిటి అనిమిషా...” అని అడిగాడు.

“అనిరుద్ర” సిగ్గుపడ్తూ చెప్పింది అనిమిష, స్టాఫ్ అంతా షాకయ్యారు. నిఖిత ఇబ్బందిగా బాస్వైపు చూసింది. భావనలో చిన్న ఫీలింగ్. బాస్ మొహంలోని బాధ ఆమెకు అర్ధమవుతూనే ఉంది.

“లెటజ్ కంగ్రాట్స్ హర్...” అనగానే స్టాఫ్ ఒక్కొక్కరూ అనిమిషను అభినందించసాగారు.

“డియర్ స్టాఫ్... నిన్ననే నేనో ప్రామిస్ చేశాను. నా దగ్గర పనిచేసే స్టాఫ్లో ఎవరి పార్ట్నర్ కి ఉద్యోగం లేకపోయినా రెట్టింపు జీతం ఇస్తానని. అలా పెళ్లయిన వెంటనే డబుల్ జీతం అందుకునే అదృష్టవంతురాలు మన అనిమిషే. అంతేకాదు... మన సంస్థలో పనిచేసే అనిమిష కొత్త కాపురానికి కావాల్సిన ఫర్నిచర్ సమకూర్చుకోవడానికి కావాల్సిన లోన్ ఇంట్రెస్ట్ లేకుండా... సంవత్సరంపాటు కటింగ్ లేకుండా అందిస్తున్నాను” అన్నాడు శోభరాజ్.

అందరూ చప్పట్లు కొట్టారు. శోభరాజ్ మరోసారి స్టాఫ్ వైపు చూసి, “ఈ రోజంతా మీరు పని చేయనక్కర్లేదు... జాలీగా కబుర్లు చెప్పుకోవచ్చు... అఫ్ కోర్స్ నా గురించి కామెంట్స్ కూడా చేసుకోవచ్చు... రేపు అనిమిష మ్యారేజ్ డే కోసం గిఫ్ట్ కోసం షాపింగ్ చేయడానికి మ్యారేజ్ ఏర్పాట్లు చేయడానికి సెలవు ప్రకటిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అనిమిషా... సీ యూ టుమారో...” అంటూ శోభరాజ్ తన క్యాబిన్ లోకి వెళ్లిపోయాడు.

టెంపుల్లో పెళ్లి సింపుల్ గా జరిగింది. ఆఫీసు స్టాఫ్ అంతా వచ్చారు. అనిరుద్ర తరపు నుంచి బామ్మ, కార్తీక్ మాత్రమే వచ్చారు. పెళ్లి తంతు ముగిశాక అంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. అనిరుద్ర అనిమిషతోపాటు బయల్దేరే ముందు బామ్మ అనిమిషను ఆపింది.

“చూడమ్మా.. అనిమిషా... నువ్విప్పుడు నాకు మనవరాలివి... నా మనవడికి ఓ విధంగా బాస్... వాడు నీ దగ్గర మొగుడు ఉద్యోగం చేస్తున్నందుకు నాకేం బాధగా లేదు... ఆ ఉద్యోగం పర్మినెంట్గా వుండేలా చేయమని ఆ తిరుపతి వెంకటేశ్వరుణ్ణి వేడుకుంటున్నాను. నీకు ఎన్నో ముచ్చట్లు జరిపించాలని ఉంది. అవేవీ మీ ఒప్పందంలో లేవని మా అనిరుద్దుడు చెప్పాడు. నీకో విషయం తెలుసా అనిమిషా... అనిరుద్దుడు మన్మధుడి కొడుకు పేరు. ఆ పేరు పెట్టుకున్న మా అనిరుద్ధుడికి మొదటి రాత్రి యోగం లేదు... అయినా బాధలేదు. ఇంకా ఎన్నో రాత్రులు ఉన్నాయి. వాడి పెళ్లయినా వాడికి ఉద్యోగం దొరికినా కాశీకి వస్తానని మొక్కుకున్నా. రేపే బయల్దేరుతున్నాను. నేను కాశీ నుండి వచ్చేటప్పటికి నువ్వు నా మనవణ్ణి పర్మినెంట్ మొగుడిగా చేసుకోవడం నేను చూడాలి...” అంటూ కళ్ళు ఒత్తుకుంది బామ్మ.

అనిమిష కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇలాంటి వ్యక్తిత్వం వున్న బొమ్మలు కూడా ఉంటారా? బామ్మ అనిరుద్రవైపు తిరిగి చెక్ బుక్, తాళాల గుత్తి చేతిలో పెట్టింది.

“ఒరే... ఈ ఆస్తి అంతా నీదే... నా మనవడికి కాకుండా ఎవరికిస్తాను? ఆ దేవుడే వచ్చి అడిగి ఒక్క పైసా కూడా ఇవ్వను... జాగ్రత్తగా...” అంటూ అనిరుద్ర బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. అనిరుద్ర కళ్లు చెమ్మగిల్లాయి.

****
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 10-11-2018, 01:48 PM



Users browsing this thread: 2 Guest(s)