Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కధా స్రవంతి ❤️
#33
సంజు 


అయ్యాయో చేతిలో డబ్బులు పాయనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే

ఉన్నది కాస్తా ఊడింది, సర్వమంగళం పాడింది
పెళ్ళాం మెళ్ళో నగలతో సహా తిరుక్షవరమైపోయింది...

అని పాడుకుంటూ ఎండలో ఇంటి దారి పట్టి నడుస్తున్నాను , చేతిలో ఉన్న న్యూస్ పేపర్ ని నా కాలికి రిధంగా కొట్టి డప్పులు వాయిస్తూ....

పావుగంట ముందు :

పొద్దున్న పది గంటలకి లేచి కూర్చున్నాను పక్కనే ఉన్న బాటిల్ లో మంచి నీళ్లు తాగి అద్దంలో నా మొహం చూసుకున్నాను , మరీ...పనా పాటా.. కాళీయేగా... నలభై ఐదేళ్ళ వాడివి ఇంకా కాళీయే అని చెప్పుకోడానికి నీకు సిగ్గు లేదు అని తిట్టుకోకండి.

నా గురించి చెప్తాను ఇరవై రెండేళ్ల వయసులో డిగ్రీ అయిపోయిన వెంటనే ఏదేదో చేద్దామనుకున్నాను కానీ మా నాన్న గారు కీర్తి శేషులు రామ్ముర్తి గారు ఈలోగా చెయ్యాల్సిన అప్పులన్నీ చేసేసి ఎలా తీర్చాలో తెలియక ఉరి వేసుకున్నాడు.

అంతే నా ఆశలన్ని నీరు కారిపోయాయి అప్పులు తీర్చడానికి చదువు వదిలేసి స్కూల్ లో టీచర్ గా జాయిన్ అయ్యాను, తెలుసుగా ప్రైవేట్ టీచర్లకి జీతాలు అంత అంత మాత్రమే... ఇక నా అప్పులు తీరావేమో అన్న భయంతొ ఇష్టం లేకుండానే కట్నం కోసం పెళ్లి చేసుకున్నాను.

నాన్న చేసిన అప్పులు తీర్చడానికి నాకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది, అప్పులు త్వరగా తీరాలని, నాకంటూ కొంత డబ్బు సమాకూరాలన్నా ఏదో ఒకటి చెయ్యాలని బ్యాంకు నుండి లోన్ తీసుకుని నలుగురు ఫ్రెండ్స్ తొ కలిసి పార్టనర్ షిప్ లో ఒక స్థలం తీసుకుని ఇల్లు కట్టాము.

చిన్నప్పటి నుంచి చదువులో ఆ తరువాత అప్పులలో మునిగిన నాకు గాలి తిరుగుళ్ళు తిరిగే అవకాశం రాలేదు అందుకే కొంచెం మేతకగా ఉంటానెమో.... నా స్నేహితులు నన్ను మోసం చేశారు ఆ దెబ్బ నుంచి కోలుకోడానికి ఇంకో పది సంవత్సరాలు పట్టింది.

ఎన్ని జరిగినా నా సొంత ఇల్లుని నా భార్య బంగారాన్ని మాత్రం ముట్టుకోలేదు... కానీ ఈ గోలలో పడి నా భార్యని ప్రేమించడం మరువలేదు కొంచెం పెడ చెవిన పెట్టాను మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది అదీ కొంచమే... తనకి నేను పిల్లల్ని ఇవ్వలేక పోయాను అదే నాకు బాధగా ఉంటుంది అలాగని నాలో లోపం ఏమి లేదు ఉన్న కష్టాలలో పుట్టే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నాను అంతే...

కానీ నిన్న రాత్రి మా ఇద్దరికీ కొంచెం గొడవ అయ్యింది, దానికి కారణం లేకపోలేదు అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి డబ్బుల కోసం నన్ను నిలదీసారు ఆ సమస్య పరిష్కరించాను కానీ నా భార్యని సముదయించలేక పోయాను.

బ్రష్ చేసి లోపలికి వచ్చాను నా భార్య అలికిడి లేదు ఫ్రిడ్జ్ డోర్ తీసి వాటర్ తాగి హాల్లోకి వచ్చాను టేబుల్ మీద ఒక కాగితం అచ్చం సినిమాలో లాగే కనిపించింది నాకు తీసి చూసాను పేపర్ మొత్తం నింపేసింది మొత్తానికి నాతో ఉండదలుచుకోలేదు వేరేవాడితో వెళ్ళిపోతున్నాను అని దాని సారాంశం.

వెళ్లి బీరువా ఓపెన్ చేసాను తన నగలేవి లేవు, బాధతో ఏం ఆలోచించకుండా ముందు రైల్వేస్టేషన్ లో వెతికి బస్సు స్టాండ్ కి వచ్చాను చివరిగా కాళీ బస్సులో కూర్చొని ఉంది పక్కనే ఎవరో అబ్బాయి చిన్నవాడు.... ముభావంగా కిటికీ లోనుంచి చూస్తు ఏదో ఆలోచిస్తుంది.

నా అడుగులు అటువైపు పడుతుంటే నా మనసు ఎదురు తిరుగుతుంది..

"ఎందుకు తనని ఆపుతున్నావ్?"
తను నా భార్య.

"బలవంతంగా తీసుకొచ్చి సంతోషంగా కాపురం చెయ్యగలవా?"
లేదు చెయ్యలేను.

"ఇంతవరకు నీతో ఆనందంగా తన అవసరాలు తీరాయి కానీ తనని సంతోష పెట్టావా ఇప్పుడు తీసుకెళ్లి మళ్ళీ తనని సంతోషంగా చూసుకోగలవన్న నమ్మకం ఉందా?"
ఏమో నేను చెప్పలేను, నా జీవితంలో ఏమైనా జరగొచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇవ్వలేను.

"ఇన్నేళ్లు నీతో కాపురం చేసిన నీ భార్య ఎవరో ముక్కు మొహం తెలియని చిన్న పిల్లవాడితొ వెళ్ళిపోతుంది... అది తనకి నీమీద ఉన్న నమ్మకం, కాదని చెప్పగలవా?"
..............

"మాట్లాడవే?"

వెంటనే ఇంటికి వెళ్లి తన మందుల కవర్ బీరువాలో ఉన్న డాకుమెంట్స్ తీసుకుని తిరిగి బస్సు స్టాండ్ కి వచ్చాను.... హమ్మయ్య ఇంకా బస్సు బైలుదేరలేదు, అనుకుని బస్సు ఎక్కాను.

నన్ను చూడగానే నా భార్య భయంతొ గజ గజ వణికిపోయింది , పక్కనే ఉన్న వాడు లేచి పరిగెత్తడానికి అటు ఇటు చూసాడు..

"కూర్చో అన్నాను గట్టిగా " వేరే సీట్ లో కూర్చున్నాడు... వెళ్లి నా భార్య పక్కన కూర్చున్నాను భయంతొ తనకి చెమటలు పడుతున్నాయి, నా చేతులతో తన మొహం తుడిచి తన చేతులు పట్టుకున్నాను.

"సంజూ... భయపడకు నేను నిన్ను ఆపడానికి రాలేదు"

నా భార్య మొహంలోకి భయం స్థానం లో ఆశ్చర్యం మొదలయింది.

తన కళ్ళలోకి చూస్తూ " సంజు... నీ తప్పు లేదు నా పరిస్థితులు బాలేవు అంతే చిన్నప్పటి నుంచి ఇంతే ఈ కష్టం కాకపోతే ఇంకోటి వస్తూనే ఉంటాయి వాటికి నేను అలవాటు పడ్డాను... కష్టాలు అందరికి వస్తాయి కానీ నావి భరించలేనివి, మొయ్యలేనివి అది నా దురదృష్టం... ఇదిగో నీ మందులు మర్చిపోయావు అలానే ఇది మన ఇల్లు పోయిన సంవత్సరమే నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించాను నీకు అవసరం అవుతుంది.. అంతే ఇవి ఇచ్చి వెళదామనే వచ్చాను" అని తను కళ్ళు అప్పగించి చూస్తున్నా...సీట్ లోనుంచి లేచాను వెళ్ళిపోడానికి.

ఒక్క సారి వెనక్కి తిరిగాను..."సంజూ ఒక్కసారి నీ నుదిటి మీద ముద్దు పెట్టుకోనా?" తను ఏమి మాట్లాడలేదు అలానే చూస్తుంది..

వెనక్కి చూడకుండా ఆటో ఎక్కకుండా ఒక పేపర్ కొనుక్కుని నడుస్తూ పాట పాడుకుంటూ వెళ్తున్నాను.

నా వస్తువులు తీసుకుని ఇక ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదామని చివరి సారిగా లోపలికి వెళ్లాను... కిచెన్ లో ఏదో చప్పుడు.... వెళ్లి చూసాను సంజూ ఏదో సర్దుతుంది.

తనని ఇంట్లో చూడగానే నాకు తెలియకుండానే నా కళ్లెమ్మటి నీళ్లు వచ్చాయి.... సంజు నన్ను చూసి ఏడ్చుకుంటూ వేగంగా వచ్చి నా కౌగిలిలో చేరిపోయింది.... గట్టిగా వాటేసుకున్నాను... నా చెయ్యిని తన చేతిలోకి తీసుకుని గట్టిగా పట్టుకుంది..


నాకు మళ్ళీ ధైర్యమొచ్చింది........


❤️❤️❤️
❤️
Like Reply


Messages In This Thread
RE: కధా స్రవంతి ❤️ - by Takulsajal - 13-06-2022, 11:36 PM



Users browsing this thread: 1 Guest(s)