Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic 'చిత్ర' కథ
#4
శేషగిరి వచ్చి
" తెల్లోళ్ళు ఉండే దగ్గర నీళ్లు సరిపోట్లే అంట అన్నయ్య. కొద్ది పాటి నీళ్లు మళ్లించడం కోసం మన వాళ్ళతో కాలువ తవ్వించుకుంటున్నారు." అని చెప్పాడు. శేషగిరి చెప్పిన విధానం బ్రిటిష్ వాళ్ళు తప్పుచేయట్లేదన్న భావన కలిగించేలా ఉంది. వెంటనే కోపం చిర్రెత్తుకు వచ్చింది రాఘవులుకు.
శేషగిరిని గట్టిగా వెనక్కు నెట్టాడు. ఆ బలానికి శేషగిరి ఎగిరి వెనక్కు పడ్డాడు.
 
కోపం తో బ్రిటిషు వాళ్లపై విరుచుకు పడ్డాడు యలమంచి వీర రాఘవులు. అక్కడున్న రైతులు కూడా రాఘవులతో జత కలిసి బ్రిటిష్ సైనికులపై విరుచుకు పడ్డారు. కాసేపటికే వాళ్లు కాళ్లకు పని చెబుతూ వెనక్కి తిరిగి చూసారు.
 
బీడు భూమి మధ్యలో నాగలిని పట్టుకొని గంభీరంగా నిలుచున్న వీర రాఘవులు. అతని వెనకాలే నిలుచొని 'మేఘమలుపు మారాజు' అంటూ జేజేలు కొడుతున్న ప్రజలు. వారికి కొద్ది దూరంలో ఆది శేషునిలా కోపంతో విషపు పళ్ళు కొరుకుతున్న శేషగిరి.
 
“””
 
నరహరి కి ఏమి అర్ధం కాలేదు. అంటే తాను ఇన్ని రోజులు నమ్మింది తప్పా ? ఆ రోజు బ్రిటిషు వాళ్ళని తరిమి కొట్టింది వీర రాఘవులా ? శేషగిరి కాదా ?
 
ఆలోచిస్తూ ముందు పేజీలు చదువ సాగాడు.
 
"
 వర్షానికి చెరువులో నిండిన నీటితో, బావి నీటితో వ్యవసాయం చేసారు మేఘమలుపు గ్రామ ప్రజలు. క్రమం తప్పకుండా శిస్తులు కట్టే వారు. వీర రాఘవులు బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి చిన్న పాటి సైన్యాన్ని తయారు చేసాడు. ఇంకో వైపు వీర రాఘవులును తుదముట్టించడానికి సమయం కోసం వేచి చూస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు. డబ్బు, కీర్తి ఆశ జూపి శేషగిరిని బ్రిటిష్ వాళ్ళు తమ వైపు లొంగతీసుకున్నారు.
 
వ్యవసాయానికి వాడుతున్న నీటిపై అదనంగా శిస్తు వసూలు చేయడం మొదలు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. ఇది తెలుసుకున్న వీర రాఘవులు తన చిన్నపాటి సైన్యాన్ని తీసుకొని బ్రిటిష్ వారి కోట పైనే దాడి చేసి వారి జెండాను తగుల బెట్టాడు. ఆ యుద్ధంలో గాయపడ్డ వీర రాఘవులును కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఊరి ప్రజలు. ఆడ వాళ్ళు సైతం పూజలు చేస్తూ బరిసెలు పట్టారు.ఆ రోజుతో బ్రిటిష్ వాళ్లకు వీర రాఘవులు ధైర్యమెంతో, బలమెంతో అర్ధమయిపోయింది. పై అధికారులకు అదనపు సైన్యం కోసం లేఖల మీద లేఖలు రాసారు. శేషగిరితో కలిసి వీర రాఘవులు అంతం చేయడం కోసం పథకాలు వేయసాగారు.
 
ఒక రోజు రాత్రి శేషగిరి, వీర రాఘవులు ఒంటరిగా వస్తుంటే బ్రిటిష్ వాళ్ళు దాడి చేసారు.
నేనూ ఆ సమయంలో వారితో పాటే ఉన్నాను. రాఘవులు వీరోచితంగా పోరాడి బ్రిటిష్ సైనికులందరిని చంపేశాడు. ఎప్పటి లాగే వాళ్ళ జెండాను కూడా తగుల బెట్టాడు. కానీ తన తమ్ముడే తనను చంపేస్తాడని మాత్రం ఊహించలేక పోయాడు. తన తమ్ముడి కత్తి పోటుకు చివరి ప్రాణం వదిలాడు. అప్పుడు నాకున్న డబ్బు ఆశకు, ప్రాణ భయానికి నేను కూడా శేషగిరి తో చేతులు కలిపాను. రాఘవులు శవాన్ని పూడ్చి పెట్టేసి, బ్రిటిష్ వారికి భయపడి పారిపోయినట్లు ఊరి ప్రజలను నమ్మించామ్. బ్రిటిష్ వారిని ఒంటరిగా శేషగిరి ఎదుర్కొని హతమార్చినట్లు చెప్పాను.
 
ఆ రోజు తరువాత నెమ్మదిగా శేషగిరి మీద గౌరవం పెరిగింది ప్రజలకు. తమను వదిలి పారిపోయిన రాఘవులును అసహ్యించుకునేవారు. రాఘవులు పారిపోయాడని నమ్మని వారు నెమ్మదిగా బ్రిటిష్ సైనికుల చేతుల్లో హతమయ్యేవారు.
 
అప్పటి నుండి శేషగిరి ని ఉపయోగించి ప్రజా ఉద్యమాలను అణగదొక్కే వారు బ్రిటిష్ వాళ్ళు. చరిత్రను తిరిగి రాసారు. శేషగిరి 'మేఘమలుపు మారాజు' అయ్యాడు. వీర రాఘవులు చరిత్రకు పట్టిన చెదల్లలో కలిసిపోయాడు.
 
కానీ జీవిత చరమాంకంలో నాకర్ధమైందేంటంటే "పాపానికి కూడా ప్రాణం ఉంటుంది. కాలంతో పాటు
దాని బరువు పెరుగుతుంది. అది ఇప్పుడు నా మనసు మోయలేనంత బరువు పెరిగింది. అందుకే ఇప్పుడు ఈ పుస్తకం రాస్తున్నాను. చెదళ్లలో కలిపిన ఆ మహానుభావుని ముఖ చిత్రాన్ని నా స్వహస్తాలతో నేనే వేస్తున్నాను.
 
నేను ఇప్పుడు మొదలు పెట్టిన ఈ నిజం, సంవత్సరాలుగా పాతుకుపోయి ఉన్న అబద్దాన్ని అంతం చేయాలని ప్రార్ధిస్తున్నాను.
 

 
చివరగా బీడు భూముల మధ్యలో నాగలి పట్టుకొని నిలుచొని ఉన్న 'యలమంచి వీర రాఘవులు', వెనుకాల జేజేలు కొడుతున్న జనం చిత్రం ఉంది.
 
 ***
 
పుస్తకం చదవడం అయిపొయింది. తలెత్తి ఎదురుగా చూసాడు నరహరి. 'వీర రాఘవులు' చిత్రం.
గంభీరంగా తన వైపు చూస్తున్నట్లు అనిపించింది.
 
నరహరికి ఏం చేయాలో అర్ధం కాట్లేదు. తలంతా బరువెక్కింది. ఆ పుస్తకం అక్కడ పెట్టినతన్ని కలవాలని ఉంది. కానీ అతడే రాసాడు గా ఇందులో తల దూర్చడం తనకిష్టం లేదని.
 
ఈ పుస్తకం ప్రకారం చింతల శేషగిరి ఒక దేశ ద్రోహి, కానీ గొప్ప స్వాతంత్ర సమార యోధుడిలా చరిత్రలో మిగిలిపోయాడు. వీర రాఘవులను చరిత్ర మరిచిపోయింది. ఒక వేళ నిజంగా ఇది నిజమైతే, తనెలా ఆ నిజాన్ని అందరికి చెప్పగలడు.
 
"చింతల కుటుంబం రాజకీయం మొత్తం ఆధారపడి ఉంది 'శేషగిరి' చరిత్ర మీదే. ఆ చరిత్రే తప్పని చెబితే నన్ను బతకనిస్తారా ?... అంటే ఈ నిజం తెలిసినందుకే రంగనాథం గారిని MLA మనుషులు చంపేసారా ? యాక్సిడెంట్ లో చనిపోలేదా ? " ఆలోచిస్తుంటే నరహరి కి చెమటలు పట్టేసాయి.
 
సిగేరేట్ వెలిగించాడు. కాలుస్తూ ఎదురుగా తాను గీసి గోడ మీద అతికించిన శేషగిరి చిత్రాల వైపు చూసాడు. అన్ని చిత్రాల కింద చిన్న లోగో. తాను గీస్తున్నప్పుడు అంత ధ్యాస పెట్టలేదు. నల్లని మేఘాల మధ్యలోనుండి గుడ్ల గూబ చూస్తున్నట్లు ఉంది. వెంటనే నరహరి కి ఆ స్థలం ఎక్కడుందో గుర్తొచ్చింది. ఆ చిత్రాలన్నీ, షీట్స్ అన్నీ మూట కట్టి సైకిల్ పై వేసుకొని వెంటనే గురువు రంగనాథం ఇంటి వైపు బయల్దేరాడు నరహరి.
 
రంగనాథం గారి సెల్లార్ కి దారి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఏకాగ్రత కావాలనుకున్నప్పుడు రంగనాథం అక్కడే చిత్ర లేఖనం చేసేవాడు. నరహరిని కూడా కొన్ని సార్లు తీసుకెళ్లాడు. ఆ ఎంట్రన్స్ లోనే ఇలా నల్లని మబ్బుల్లో నుండి చూస్తున్న గుడ్ల గూబ చిత్రం ఉంటుంది. దాని వెనకాల ఉన్న బీరువా లోనే మార్కెట్ లో ఉన్న 'మేఘమలుపు మారాజు' పుస్తకం, కొన్ని లెటర్స్ దొరికాయి నరహరి కి.
 
అవి బ్రిటిష్ కాలం నాటి లెటర్స్. కూర్చొని చదవ సాగాడు. మేఘమలుపు బ్రిటిష్ అధికారులు తమ పై అధికారులకు వీర రాఘవులను ఎదుర్కోవడం కోసం సైన్యాన్ని పంపించాల్సిందింగా కోరుతూ రాసిన ఉత్తరాలు. వాటిలోనే శేషగిరి తమకెలా సాయం చేస్తున్నాడో కూడా తెలిపారు.
 
"ఈ ఉత్తరాలు చాలు చరిత్రను తప్పని నిరూపించడానికి.." అనుకున్నాడు నరహరి. ఈ ఉత్తరాలలో ఎక్కడ 'యలమంచి' అని ప్రస్తావించలేదు. అందుకే గురువుగారి కి ‘యలమంచి' గురించి తెలిసుండదు.
 
ఇక తాను తెలుసుకోవాల్సింది ఒకటే ఉంది "గురువు గారు చనిపోవడంలో MLA హస్తం ఉందా ? లేదా. ? " ఆలోచిస్తూ లెటర్స్ తీసుకొని ఇంటికి బయల్దేరాడు నరహరి.
 
అప్పటికే తన ఇంటి ముందు, చుట్టు పక్కల కొంత మంది మనుషులు తిరుగుతున్నారు. నరహరి కి అనుమానం వేసింది. 'కొంప తీసి తాను నేటి ప్రపంచం లో పబ్లిష్ చేసిన చిత్రం చూసి తనకు నిజం తెలిసిందని అర్ధమైపోయుంటుందా" అనుకుంటూ డబ్బా కొట్టు పక్కన దాక్కున్నాడు. అప్పుడే వాళ్లలో ఒకడు సిగెరెట్ కోసం డబ్బా కొట్టు వైపు రాసాగాడు.
 
వాణ్ణి పట్టుకొని నాలుగు పీకితే నిజం చెప్తాడు అనుకున్నాడు నరహరి. కానీ పట్టుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. డబ్బా కొట్టుకు కొంచెం దూరంగా వెళ్లి ఆ వస్తున్న అతని బొమ్మ గీసి అతనికి కనిపించేలా గోడ మీద అతుకు పెట్టాడు. పళ్ళు కనిపించేలా నవ్వుతున్నట్లు గీశాడు ఆ బొమ్మ. ఏంటో చూద్దామని అటు వైపు వచ్చాడతను. చుట్టూ చూసి ఎవరూ చూడకుండా ఆ చిత్రాన్ని జాగ్రత్తగా తీసి దాచి పెట్టుకున్నాడు.
 
అక్కడికి కుడి వైపు చూస్తే ఇంకో చిత్రం కనిపించింది అతనికి. దగ్గరికెళ్లి చూస్తే అతను కళ్ళు బయటికొచ్చేలా ఏడుస్తున్నట్లు ఉన్న చిత్రం అది. వెంటనే కోపంతో చింపేయ బోయాడు ఆ చిత్రాన్ని. అంతలోనే వెనకనుండి అతని తల మీద గట్టిగ కర్రతో కొట్టాడు నరహరి. స్పృహ కోల్పోయిన అతన్ని తన సైకిల్ కడ్డీ పై ఎక్కించుకొని గురువు గారి సెల్లార్ లోపలికి సైకిల్ తో సహా తీసుకెళ్లాడు.
 
అతన్ని కట్టేసి మొహం మీద నీళ్లు కొట్టి లేపి నాలుగు తన్నితే అర్ధమయింది నరహరికి, తాను పట్టుకుంది MLA బావమరిది 'నాగ రాజు' నే అని. స్వతహాగా భయస్తుడైన అతను నరహరి పెద్దగా కష్ట పడకుండానే నోరు విప్పి నిజాలు చెప్పసాగాడు.
 
"రంగనాథం గారు ఒక రోజు తాను గీసిన చిత్రాలన్నీ గ్యాలెరీ కి అప్పగించి సురేంద్ర బావను కలవడానికి వచ్చాడు. ఆ రోజు ఎప్పటిలా అతని మోహంలో ప్రశాంతత లేదు. బావ అడిగితే అసలు నిజం చెప్పాడు.
 
మీ గురువు గారు 'మేఘమలుపు మారాజు' పుస్తకం చదివి, రాఘవులు బ్రిటిష్ వారికి భయపడి శేషగిరిని వదిలి పిరికివానిలా పారిపోతుంటే, శేషగిరి వీరోచితంగా పోరాడుతున్నట్లు ఒక చిత్రం గీద్దామని నిర్ణయించుకున్నాడట. వాస్తవానికి దగ్గరగా చిత్రం గీయడం కోసం వీర రాఘవులు ఎలా ఉంటాడో అని లైబ్రరీస్ లో, ఆర్కైవ్స్ లో వెతకడం మొదలు పెట్టాడు. కానీ ఆ ప్రక్రియలో కాలం సైతం తనలో దాచుకున్న నిజం కనుక్కున్నాడు.
 
వీర రాఘవులు ఫోటో తీసుకొచ్చి సురేంద్రకు చూపించాడు. చింతల కుటుంబంలో అప్పటికే ఆ నిజం అందరికి తెలుసు, బయటకు వస్తే తమ రాజకీయ జీవితం అంతమవుతుందని భయంతో ఎప్పుడూ ఆ నిజాన్ని బయటికి రానివ్వలేదు. ఆ నిజం రంగనాథం నోట విన్న వెంటనే సురేంద్ర తాను ఆరా తీసి నిజా నిజాలు కనుక్కుంటానని మాట ఇచ్చి రంగనాథంను ఇంటికి పంపించాడు. ఆ రంగనాథం ఇంటికి కాకుండా పైకి చేరేలా మనుషుల్ని పురాయించాడు.
 
మళ్ళీ ఇన్ని రోజుల తరువాత ‘నేటి ప్రపంచం’లో రాఘవులు బొమ్మ చూసాం. కనుక్కుంటే నువ్వు గీసావని తెలిసింది. ఆరా తీస్తే నువ్వు రంగనాథం శిష్యుడివని తెలిసింది. అందుకే గురు శిష్యులను ఏకం చేయడానికి వచ్చాము. నువ్వేమో నీ పిచ్చి బొమ్మలతో నన్నిట్లా పట్టుకున్నవు."
ఆగకుండా ఏక దాటిన చెప్పాడు నాగ రాజు.
 
ఆయాస పడుతున్న నాగరాజుకు మంచి నీళ్లు తెచ్చి ఇచ్చాడు నరహరి. అవి తాగి మెల్లగా మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు నాగరాజు.
 
కావాల్సిన సమాధానాలన్నీ నరహరికి దొరికాయి. ఇక తాను చేయవలిసినవి రెండు పనులు. ఒకటి చరిత్రను సరి చేయడం. రెండు MLA ను హంతకుడని నిరూపించడం. రెండో పని నాగరాజు ను వాడొకొని చేయొచ్చు.
 
మరుసటి రోజు ఉదయం, రాయచూరు వెంకన్న మనవడు బాల కృష్ణ ఇంటి ముందున్న న్యూస్ పేపర్ ఎప్పటిలాగే తీసుకున్నాడు. మధ్యలో కర పత్రిక ఉంటె తీసి చూసాడు. 'యలమంచి వీర రాఘవులు' బొమ్మ. కింద "నేను ఎవరు?" అని రాసి ఉంది.
 
అతనికి నిజం ప్రయాణం ఇప్పుడే మొదలయిందని అర్ధం అయింది. నవ్వుతూ లోపలికి వెళ్ళాడు.
 
 
కొన్ని సంవత్సరాల తరువాత...
 
రంగనాథం హత్య కేసులో MLA ను అరెస్ట్ చేసారు సెక్యూరిటీ ఆఫీసర్లు. అప్పటికే తన దగ్గరున్న ఆధారాలతో శేషగిరి దేశ ద్రోహి అని, వీర రాఘవులు స్వతంత్ర సమర యోధుడని కోర్ట్ లో కూడా నిరూపించా
డు నరహరి. "చింతల శేషగిరి" ఆర్ట్ గ్యాలెరీ మూసి వేయాల్సిందిగా కోర్ట్ ఆర్డర్ పాస్ చేసింది. అదే స్థలంలో చరిత్ర మరిచిపోయిన 'వీర రాఘవులు' కోసం గ్యాలెరీ నిర్మించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 
 
కొన్ని రోజుల తరువాత..
 
 
గ్యాలెరీ ముందు స్థలం లో 'వీర రాఘవులు' చిత్రాన్ని ఉంచారు. గ్యాలెరీ లో చిత్రాలు గీసే చిత్రకారుని కోసం పోటీ జరుగుతుంది. వందలమంది పాల్గొన్నారు. వారి మధ్యలో నరహరి వీర రాఘవులు బీడు భూమి మధ్యలో నిలుచొని నాగలి పట్టుకున్న బొమ్మ గీస్తున్నాడు.
*********

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
'చిత్ర' కథ - by k3vv3 - 08-01-2023, 12:24 PM
RE: 'చిత్ర' కథ - by k3vv3 - 08-01-2023, 12:26 PM
RE: 'చిత్ర' కథ - by k3vv3 - 08-01-2023, 12:27 PM
RE: 'చిత్ర' కథ - by k3vv3 - 08-01-2023, 12:28 PM
RE: 'చిత్ర' కథ - by maheshvijay - 08-01-2023, 05:22 PM
RE: 'చిత్ర' కథ - by ramd420 - 09-01-2023, 05:30 AM
RE: 'చిత్ర' కథ - by sri7869 - 09-01-2023, 11:54 AM
RE: 'చిత్ర' కథ - by utkrusta - 09-01-2023, 05:01 PM
RE: 'చిత్ర' కథ - by k3vv3 - 14-01-2023, 08:53 AM



Users browsing this thread: 1 Guest(s)