Thread Rating:
  • 10 Vote(s) - 3.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అనిరుద్ర H/o అనిమిష
#42
అనిరుద్ర H/o అనిమిష - 12వ భాగం

అప్పుడే లోపలికి అడుగుపెట్టిన ద్విముఖ తన క్యారీబ్యాగ్ లో వున్న టిఫిన్ అందిస్తూ, కొత్త దంపతులు కదా అని నా వంతుగా అయ్యర్ హోటల్ నుండి టిఫిన్ పట్టుకొచ్చాను.

వస్తూనే మంచి సీన్ చూశాను. వాహ్ క్యా సీన్ హై... మా కెమెరామేన్ ని తీసుకురాలేదు ...

“మొగుడేసిన ముగ్గు' అని ఓ ప్రోగ్రామ్ తయారుచేసేదాన్ని” నవ్వుతూ అంది.

“మగవాడు ముగ్గులు వేయకూడదా? ఇవి ఆడవాళ్ళే చేయాలి... ఇవి మగ చేయాలి అని రాజ్యాంగంలో ఎక్కడా లేదే” అన్నాడు అనిరుద్ర. .. "

“నిజమే... మీరు హండ్రెడ్ పర్సంట్ కరెక్ట్... ముందు టిఫిన్ చేయండి. చల్లారిపోతుంది మీకిష్టమని అయ్యర్ హోటల్ నుంచి తెచ్చాను” అంది ద్విముఖ.

“ఇంత శ్రమపడి పొద్దున్నే తీసుకురావాలా? మేము చేసుకుంటాంగా” అంది అనిమిష.

“ఏదో ఫస్ట్ డే అని తెచ్చాను”

“నువ్వు కూడా మాతో జాయినవ్వు...” అంది అనిమిష ప్లేట్స్ లో టిఫిన్ సర్దుతూ.

“మా కార్తీక్ వుంటే బావుండేది. వాడికి అయ్యర్ హోటల్ ఇడ్లీలంటే చాలా ఇష్టం అన్నాడు అనిరుద్ర.

“ఎందుకు? తేరగా వచ్చాయనా?” అని నాలుక కరుచుకుంది అనిమిష.

“ఫోన్ చేసి రమ్మనండి” అంది ద్విముఖ.

“అక్కర్లేదు... నేను వచ్చేశాను” రొప్పుతూ వచ్చి అన్నాడు కార్తీక్.

“అరె.. అదేంట్రా... నీకప్పుడే ఇడ్లీ వాసన వచ్చిందా?” అడిగాడు అనిరుద్ర.

“కాదు ద్విముఖ కనిపించింది. నేను జాగింగ్ చేస్తుంటే ద్విముఖగారు ఇడ్లీలు ప్యాక్ చేయించుకోవడం చూశాను. ఖచ్చితంగా మీకోసమే అని అర్ధమైంది. నేనూ మీతో జాయిన్ అవ్వొచ్చని ద్విముఖగారిని పిలిచాను. అప్పటికే ఆటో కదిలింది...”

“అలాంటప్పుడు మరో ఆటో ఎక్కి రావొచ్చుగా. ఇలా పరుగెత్తుకుంటూ రావడమెందుకురా?”

“పాయింట్ నెంబర్ వన్... జాగింగ్ కదా అని పర్సు తేలేదు. పాయింట్ నెంబర్ టు... నీకు తెలుసుగా నాకు కుక్కలంటే ఎలర్జీ అని. నేను ఆటోని పిలుస్తూ పరుగెడుతుంటే ఓ కుక్క వెంటపడింది. అది ఆడకుక్కేమో... దాని బాయ్ ఫ్రెండ్ కుక్క గర్ల్ ఫ్రెండ్ కుక్క వెంటపడింది. ఆ రెండూ నా వెంటపడ్డాయి. జాగింగ్ కాస్తా రన్నింగ్ అయింది. పాయింట్ నెంబర్ త్రీ... ఆలస్యమైతే మీరెక్కడ నాకు టిఫిన్ మిగల్చకుండా తినేస్తారేమోనన్న భయం...” !

ద్విముఖ నవ్వింది. అనిమిష టిఫిన్ నాలుగు ప్లేట్లలో సర్దింది. నలుగురు టిఫిన్ చేశాక కాఫీ తాగి బయల్దేరారు. కాఫీ తానే కలుపుతానని చెప్పి కాఫీ కలిపి అందరికీ ఇచ్చింది అనిమిష. ద్విముఖ, కార్తీక్ వెళ్లిపోయారు.

***

“ఏం కూరలు వండను” నేల మీద కూర్చొని కూరగాయల్ని నేల మీద పరిచి అడిగాడు అనిరుద్ర.

“కూరలా.. బహువచనం లేదు... ఏకవచనమే... ఏదో ఒకటి వండండి” అంది అనిమిష.

“అదేంటి డాళింగ్... మూడు కూరలు... రసం... సాంబారు... వడియాలు... గడ్డ పెరుగు... మన మెనూలో ఇవేమీ ఉండవా?”

“ఆ ఉంటాయి... మీరు తాజ్ బంజారా ఛైర్మన్ కూతురినో, టాటా బిర్లాల వారసులో చేసుకుంటే... ఈ కూరలన్నీ వారం రోజులు రావాలి. ఒక పచ్చడి... ఒక కూర... రసం చాలు...”

“ఎట్లీస్ట్ కాస్త మజ్జిగ కూడా ఉండదా?”

“ఉండదు. అది వుంటే నా సంపాదనంతా వాటికే సరిపోతుంది” అనేసి అనిమిష బాత్రూమ్లోకి వెళ్లింది.

“హలో... బాత్రూమ్లో వున్న మహారాణి... ఆమ్లెట్ వేసుకోవచ్చా... అసలే మనకు నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగదు... ఆమ్లెట్ వుంటే అడ్జస్ట్ చేసుకుంటాను” గట్టిగా అరిచి అడిగాడు అనిరుద్ర.

“వేసుకోవచ్చు... ఎగ్ ఆమ్లెట్ కు అయ్యే గ్యాస్ మీ అకౌంట్లోకి వస్తుంది” బాత్రూమ్లో నుండే చెప్పింది అనిమిష.

“రొంబ థాంక్స్” అంటూ కూరలు తరగడం మొదలుపెట్టాడు.

టైం చూసుకుంది అనిమిష. తొమ్మిదిన్నర. కిచెన్ లోకి తొంగి చూసింది. కిచెన్లో నుండి ఘుమఘుమలు... అనిరుద్ర సీరియస్గా కూర కలుపుతున్నాడు.

“తొందరగా... ఆఫీసుకు టైం అవుతోంది” అరిచింది అనిమిష.

“వన్ మినిట్ ప్లీజ్...” అంటూనే అనిరుద్ర డిషెస్ ఒక్కోటి తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు.

“అవునూ... ఈ వంటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారు?” అడిగింది అనిమిష.

“ఎక్కడా నేర్చుకోలేదు... జస్ట్ ప్రాక్టీస్ ప్రయోగం... అంతే “వ్వా...ట్” అదిరిపడి అంది అనిమిష.

“అవును. మనకు ఒకరి దగ్గర నేర్చుకునే అలవాటు లేదు. కాస్త మెదడుతో ఆలోచించి, టేస్ట్ చూసి చేసేయడమే” అంటూ అన్నం వడ్డించాడు ఆమె ప్లేటులో.

“ఫర్లేదు... నేను వడ్డించుకుంటాను” అంది అనిమిష. “వద్దులే... ఆనక వడ్డించలేదు... జీతంలో కట్... అంటే ప్రమాదం” అన్నాడు అనిరుద్ర.

అనిమష టమోట కర్రీ వేసుకుంది. కాస్త ఉప్పు తక్కువైనా బాగానే ఉంది.అనిరుద్ర డబుల్ ఆమ్లెట్ వేసుకొని తింటున్నాడు.

“అదేంటి... అన్నం తినరా?” అడిగింది అనిమిష.

“తినను... అన్నం బదులు ఆమ్లెట్. ఆ డబ్బులతో ఆమ్లెట్ తింటున్నాను. చాలా బావుంది విజయవాడ రైల్వేస్టేషన్లో బ్రెడ్ ఆమ్లెట్ బావుంటుంది. అప్పట్నుంచి అలా ఆమ్లెట్ వేయడానికి ట్రై చేస్తున్నాను”

“అలా ఒక్కడివే మింగకపోతే కాస్త ఇవ్వొచ్చుగా” అనుకుంది మనసులో. అతను ఆమ్లెట్ తినే విధానం చూసి నోరూరింది అనిమిషకు. అతడు ఆమ్లెట్ తింటూ వుంటే చూడాలనిపిస్తోంది. ఆమ్లెట్ చివర్లు పెదవుల మధ్య పెట్టుకొని తింటున్నాడు. ఆ క్షణం అతని పళ్ల మధ్య వున్న ఆమ్లెట్ ని సగం కొరికేయాలనిపించింది. పెదవులు తడుపుకుంది. గుర్రుగా చూసింది అనిరుద్రవైపు. అనిరుద్ర ఇదేమీ పట్టించుకోకుండా ఆమ్లెట్ తిని, ప్లేటు సింక్లో వేసి... వాష్ బేసిన్ దగ్గరకెళ్లి అద్దంలో మొహం చూసుకుంటున్నాడు. అనిమిష కోపంగా అన్నం ముద్ద నోట్లో పెట్టుకొని ప్లేట్ పక్కనే వున్న ఆమ్లెట్ ని చూసి ఆశ్చర్యపోయింది..

“అది నీకోసమే... ఈ ఒక్క రోజు కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్” చెప్పాడు అనిరుద్ర.

ఒక్క క్షణం గిల్టీ ఫీలింగ్. అతడి గురించి తనెంత తక్కువగా ఆలోచించింది. 'కనీసం తన కోసం వండిన అన్నం కాస్త పెట్టినా సరిపోయేది” అనుకుంది.

****

అన్నం టిఫిన్ బాక్స్ లో పెట్టుకొని బయటకు నడిచింది అనిమిష.

“హలో... వన్ సెకన్” పిలిచాడు అనిరుద్ర.

ఆగి ఏమిటన్నట్టు చూసింది. అనిరుద్ర ఓ కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. అరటి ఆకులో మల్లెపూల మాల. అనిరుద్రవైపు చూసింది.

“మల్లెపూలలో మత్తు మందేమీ స్ప్రే చేయలేదు. కొత్తగా పెళ్లయిన అమ్మాయి మల్లెపూలు పెట్టుకోకుండా వస్తే ఆఫీసులో డౌటొస్తుంది. అయినా నన్నో మల్లెపూలు అమ్మే శాల్తీ అనుకో. నీకంతగా ఇష్టంలేకపోతే మల్లెపూల ఖరీదు ఇచ్చెయ్” అని ఆగాడు అనిరుద్ర.

చివుక్కుమంది అనిమిష మనసు. మౌనంగా ఆ మల్లెపూలను జడలో పెట్టుకుంది. అద్దంలో చూసుకుంది. కొత్త అందమేదో వచ్చినట్టు అనిపించింది.

“థాంక్స్...” అంది మనస్పూర్తిగా అనిమిష

“రొంబ వెల్కమ్... అలాగే వెళ్లేముందు బై చెప్పు... అఫ్ కోర్స్ నా కోసం కాదు. చుట్టుపక్కల వాళ్లు చూసి 'వాహ్' అనుకోవడం కోసం”

“బై” మనస్ఫూర్తిగానే చెప్పింది. ఆ క్షణం తనే అతని దగ్గరకెళ్లి అతణ్ణి గట్టిగా వాటేసుకుని ‘బై’ చెప్పినట్టు అతను తన నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి హత్తుకున్నట్టు ఫీలయ్యింది. ఆ ఫీలింగ్ ఆమెలో మధురోహలను శృతి చేశాయి.

***

అనిమిష వెళ్లాక ఇల్లంతా సర్దే కార్యక్రమంలో వుండగా కార్తీక్ వచ్చాడు. వస్తూనే లోపలికి తొంగిచూశాడు.

“కార్తీక్... లోపలికి రాకుండా ఏంటలా తొంగి చూస్తున్నావ్?” అడిగాడు అనిరుద్ర కార్తీక్ ని లోపలికి ఆహ్వానిస్తూ,

“సిస్టర్ వుందేమోనని”

“సిస్టరా? ఈ టైంలో వుండేది మిస్టరే. అయినా సిస్టర్ అంటే ఎందుకంత భయం? హాస్పిటల్లో సిస్టర్ ని చూసి ఇంజెక్షన్ పొడుస్తుందేమోనని భయం. ఈ సిస్టర్ కి భయపడ్డం ఎందుకు?”

“పెళ్లయితే మగవాడి స్వేచ్ఛ ఐస్లా కరిగిపోతుందని నా అభిమాన రచయిత సరసమైన కథలో రాశాడు” -

“నా బాడీ ఫ్రీజర్ లాంటిది. ఇక్కడ కరిగేవేమీ ఉండవు. మనసు తప్ప... ఇంతకీ విశేషాలేమిటి?”

“ఏమున్నాయి అనూ... నీ పెళ్లయ్యాక నన్ను ఒంటరితనం సునామీలా చుట్టేసింది”

“ఈ డైలాగ్ వింటే రీడర్స్ అపార్ధం చేసుకుంటారు. ఇంకోమాట చెప్పు... ఈలోగా నేను మొహం కడుక్కొస్తాను... అలా బయటకెళ్లి కాఫీ తాగొద్దాం” అన్నాడు అనిరుద్ర.

“అదేంట్రా అనూ... ఫ్రెండొస్తే కనీసం కాఫీ కూడా ఇవ్వొద్దంటుందా మీ ఆవిడ”

“అనదు.. ఆవిడ అనురాగదేవత... మట్టిలో మాణిక్యం...” “అమ్మోరు ఏమీ కాదు... పొగడ్తలు ఆపి విషయం చెప్పు”

“ఈ ఇంట్లో జరిగే ఖర్చులు ఫిఫ్టీ ఫిఫ్టీ... గెస్ట్లకు అయ్యే ఖర్చు ఎవరి గెస్ట్లు వస్తే వారే భరించాలి. ఆమె అకౌంట్లో కాఫీ తాగడం తప్పుకదరా...”

కార్తీక్ మోకాళ్ల మీద కూర్చున్నాడు.

“ఏం చేస్తున్నావురా...” కంగారుగా అడిగాడు అనిరుద్ర.

“నీ నిజాయితీ ముందు మోకరిల్లుతున్నాను. వెయ్యేళ్లు మీ చుట్టుపక్కల వాళ్ల ఆయుషు

పోసుకొని వర్ధిల్లరా...”

“థాంక్స్... పద” అంటూ తాళం కప్పతో బయటకు నడిచాడు అనిరుద్ర.

****
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 06:20 PM



Users browsing this thread: 1 Guest(s)