Thread Rating:
  • 10 Vote(s) - 3.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అనిరుద్ర H/o అనిమిష
#44
అనిరుద్ర H/o అనిమిష - 14వ భాగం

బ్యాంక్ నుంచి బయటికొచ్చింది అనిమిష బైక్ కోసం బాస్ ఇచ్చిన డబ్బును కూడా బ్యాంక్లో డిపాజిట్ చేసింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ద్విముఖ కనిపించింది.

“హాయ్... ఇదేంటి... రోడ్లన్నీ సర్వే చేస్తున్నావా?” అడిగింది అనిమిష.

“ఏ ప్రోగ్రామ్ చేయాలో అర్ధంకావడం లేదు. మా క్రియేటివ్ హెడ్ సంగతి తెలుసుగా... ఆలోచించండి.... వెరైటీగా... నాలా... అంటాడు. అతడాలోచించింది ఏమీ ఉండదు. మేము చించలేక చావాలి” అంది ద్విముఖ. ఆ అంది. “మేము టీవీ ఛానెల్స్ తిప్పుతూ క్షణాల్లో నిర్దాక్షిణ్యంగా మారుస్తూ ఉంటాం. మీకేమో “ఏ ప్రోగ్రాం చేయాలా? ఎలా డిఫరెంట్ గా ఉండాలా? అన్న తాపత్రయం” అంది అనిమిష.

“ఏం చేస్తాం? పీత కష్టాలు పీతవి... జార్జి బుష్ కష్టాలు సద్దాం హుస్సేన్ వి” అంది ద్విముఖ.

“పాలిటిక్స్ లోకి వెళ్లవా.... అద్సరేగానీ కాఫీ తాగుతావా?” అడిగింది అనిమిష.

“కాఫీనా...? అని ఆగి, “సరే పద... కాఫీలో కెఫిన్ మన మెదడును ఉత్తేజ పరుస్తుంది అంటూ కాఫీ షాప్ వైపు నడిచింది.

***

“ఇంతకీ ఏం పని మీద ఇటొచ్చావ్?”

“బ్యాంక్లో మనీ డిపాజిట్ చేద్దామని”

“ఎంత వరకొచ్చింది?” అడిగింది ద్విముఖ.

“వనెండాఫ్ వరకూ అడ్జస్టయ్యింది. ఇంకా మూడున్నర లక్షలు కావాలి. ఎంతగా సేవ్ చేసినా కుదరటం లేదు”

“పోనీ ఫైనాన్స్లో ట్రై చేద్దామా?” అడిగింది ద్విముఖ.

. “వద్దు... వడ్డీ భరించడం మన వల్ల కాదు” అంది . “పోనీ మీ ఆయన్ని అడక్కూడదా?”

“ఆయనా... మొన్నోసారి రెండోసారి కాఫీ అడిగానని దానికి నాలుగు రూపాయలు వసూలు చేశాడు. మనీ మైండెడ్ మొగుడు” అంది కచ్చగా.

“ఏమో... నాకు అలా అనిపించడంలేదు”

“ఎందుకనిపిస్తుంది... రెండు రోజులు ఆయనతో వుండి చూడు.. నీకే తెలుస్తుంది” అంది అనిమిష.

“నీకభ్యంతరం లేదా?” అడిగింది ద్విముఖ.

“ఏయ్... యూ... నాటీ” అంది అనిమిష .

“చూశావా... 'నా మొగుడు నాకే సొంతం' సినిమా అందుకే వచ్చింది” అనిమిష హాయిగా నవ్వింది. ఇద్దరూ కాఫీ తాగి డిస్పర్స్ అయ్యారు.

***

“హలో... ఎక్స్ క్యూజ్ మీ” అనిమిష ఆఫీసుకు బయల్దేరుతుంటే పిలిచాడు అనిరుద్ర.

"ఏంటీ...” ఆగి వెనక్కి తిరగకుండానే అడిగింది. “మన శాలరీ ఎప్పుడిస్తారు?”

“శాలరీనా? దానికింకా రోండ్రోజుల టైం వుందిగా... ఎప్పుడూ మనీ మనీ అని చంపుతావేంటి?”

"అది కాదు నాకర్జంటుగా కొంత అమౌంట్ కావాలి. ఓ ఫైవ్ హండ్రెడ్ సర్టగలవా?”

“ఏం... ఫైవ్ హండ్రెడ్ లేదా?”

“నా స్వార్జితం లేదు” చెప్పాడు ఒళ్లుమండి అనిరుద్ర.

“అయితే ఓ పని చేయండి. బీచ్ రోడ్డులో ఏదైనా పని వెతుక్కోండి” చెప్పి విసురుగా బయటకు నడిచింది.

“పోవే... రాక్షసి” కసిగా బయటకే అనేశాడు అనిరుద్ర. “ఏంటీ... ఏమన్నారు?” అనడిగింది వెనక్కొచ్చి.

“బైబై.. సీ.. యూ... అన్నాను" చెప్పాడు అనిరుద్ర.

* * *

ఆఫీసు వదిలిపెట్టగానే ఆటోలో బయల్దేరింది బస్సు కోసం వెయిట్ చేసే ఓపిక లేక అనిమిష, ఆటో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది.

ఓ వ్యక్తి ఆటో లోపలికి తల పెట్టి, “ఎక్స్ క్యూజ్ మి మేడమ్... అందమైన టెడ్డీబేర్... జత అరవై రూపాయలు. చాలా బావుంటాయి. టెడ్డీబేర్లను అందమైన అమ్మాయిలతో పోలుస్తారు. టెడ్డీబేర్ మీ ఇంట్లో వుంటే...” అతను చెప్తుండగానే తల తిప్పి చూసి షాకైంది అనిమిష.

ఎదురుగా అనిరుద్ర. టెడ్డీబేర్ బొమ్మలు చేతిలో పట్టుకుని తనకు చెప్తున్నాడు.

“మీరా..” షాకింగ్ గా అడిగింది.

“యస్ మేడమ్... టెడ్డీబేర్ కావాలా వద్దా.. మీకైతే యాభైకే...” అన్నాడు అనిరుద్ర.

“ఇదేంటి... అసహ్యంగా... ముందు ఆటో ఎక్కండి” అంది ఆటోడ్రైవర్ తనను చూస్తున్నాడేమోనని ఫీలవుతూ.

“సారీ... మా బాస్ జీతం ఇవ్వలేదు. అందుకే పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను. అన్నట్టు నీకు అన్నం వండి పెట్టాను. బాగా మెక్కి పడుకోవచ్చు. నాకు వద్దు” చెప్పాడు మెల్లిగా అనిమిష చెవిలో అనిరుద్ర.

ఆటోవాడు విచిత్రంగా రియర్ వ్యూ మిర్రర్ లో నుండి చూస్తున్నాడు.

“ఏయ్ టెడ్డీ బేర్.. కమ్ హియర్... అటు పక్క పాలియో కారులో నుండి ఓ మిడిల్ ఏజ్ ఆంగ్లో ఇండియన్ పిలిచింది.

“కమింగ్ మేడమ్...” అంటూ అటు వెళ్లాడు అనిరుద్ర.

అనిమిషకు ఇరిటేటింగ్ గా ఉంది. ఎప్పుడు అనిరుద్ర వస్తాడా? ఎప్పుడెప్పుడు దులపాలా? అని ఎదురుచూస్తోంది. తొమ్మిది అయింది. పది దాటింది. అయినా రాలేదు. కోపం క్రమక్రమంగా తగ్గుతోన్నట్టు అనిపించింది. కోపం స్థానే ఇంకా రాలేదే... అన్న ఆదుర్దా చోటు చేసుకుంది.

ఆ ఆదుర్గా స్థానే... పాపం అతనికి డబ్బుతో ఏం అవసరమో... తను ఇచ్చినా బావుండుననే ఫీలింగ్ చోటు చేసుకుంది. అతని కోసం పదకొండున్నర వరకూ ఎదురుచూసి తలుపు దగ్గరగా వేసి తన గదిలోకి వెళ్లి పడుకుంది. ఈసారి తన గదికి బోల్ట్ పెట్టలేదు.

***

ఎవరో తనను పిలిచినట్టు అనిపించి ఉలిక్కిపడి కళ్లు తెరిచింది అనిమిష, ఒక్క క్షణం కంగారు... భయం... “ఏంటి... నా గదిలోకి వచ్చావ్?” కంగారుగా అడిగింది అనిరుద్రని.

“ఒక్కసారి అలా హాలులోకి వస్తావా?” అడిగాడు అనిరుద్ర.

“ఎందుకు?” అనుమానంగానే అడుగుతూనే లేచింది.

హాలు చీకటిగా అనిపించింది. హాలు లోపలికి అడుగు పెట్టి షాకయింది. హాలు మధ్యలో టేబుల్ మీద కేక్... క్యాండిల్స్ వెలిగించి ఉన్నాయి. కేక్ మీద... 'హ్యాపీ బర్త్ డే టు అనిమిష’ అన్న అక్షరాలు....

“మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే” చప్పట్లు కొట్టి అన్నాడు అనిరుద్ర. అనిమిష షాకయ్యింది. అప్రయత్నంగానే ఆమె కళ్లు చెమ్మగిల్లాయి.

“కమాన్ కేక్ కట్ చెయ్...” అంటూ చాకు చేతికి ఇచ్చాడు. 'కీ' ఇచ్చిన ఉమెన్ రోబోలా ఆమె కేక్ దగ్గరకి వెళ్లి కేక్ కట్ చేసింది.

“బీ హ్యాపీ... నువ్వెప్పుడూ హ్యాపీగా, నీకిష్టమైన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండాలి. దిసీజ్ మై స్మాల్ గిఫ్ట్... జస్ట్ ఫర్ హండ్రెడ్ వేల్యూ.. కైలాసగిరి వెళ్లి తెచ్చాను. నీకో విషయం తెలుసా... ఉదయం నుండి టెడ్డీ బేర్లు అమ్మితే వచ్చిన డబ్బుతో వీటిని కొన్నాను. చీరకే నాలుగు వందలు సరిపోయాయి. కైలాసగిరి నుండి లెఫ్ట్ అండ్ రైటే...” అనిరుద్ర చెప్తుంటే అతని మొహం వంకే చూస్తుండిపోయింది.

అతని మొహం వాడిపోయింది. కళ్లు ఎర్రబడి ఉన్నాయి. జుట్టు రేగిపోయింది. అంటే ఉదయం తనని శాలరీ అని అడిగింది. ఇందుకోసమా...

“నీ సర్టిఫికెట్స్లో నీ డేటాఫ్ బర్త్ ట్వంటీ ఫస్ట్ అని ఉంది. వన్స్ ఎగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే” అంటూ కేక్ ను ఆమె నోట్లో పెట్టాడు.

ఆ తర్వాత వెళ్లి లైట్ వేసి, మెయిన్ డోర్ క్లోజ్ చేసి తన గదిలోకి వెళ్తూ, “గుడ్ నైట్” అన్నాడు.

“ఆ చీర నాకెందుకు?” అని అడిగింది అనిమిష

“బర్త్ డే గిఫ్ట్... మన ప్రొఫెషనల్ అకౌంట్లోకి రాదు. నా భార్యకు నేనిచ్చే గిఫ్ట్. నచ్చకపోతే వదిలెయ్... ఎవరికైనా ఇచ్చెయ్” చెప్పాడు అనిరుద్ర.

అనిమిష అద్దం ముందు నిలబడింది. తను కట్టుకున్న చీర విప్పేసింది. పెట్టీకోట్ తో ఉంది. అనిరుద్ర తెచ్చిన చీర ఒంటికి చుట్టుకుంది. తర్వాత ఇష్టంగా కట్టుకుంది. చిత్రంగా అనిరుద్ర తనను చుట్టేసిన ఫీలింగ్ కలిగింది. ఆ చీరను విప్పేయబుద్ధికాలేదు. అలాగే
చిరతో పడుకుండిపోయింది. తెల్లవారుఝామునే అనిరుద్ర ఆ చీరలో తనను చూడకముందే విప్పేసింది.

“ఇవ్వాళ టిఫినేమిటి?” అడిగింది అనిమిష కిచెన్లో వున్న అనిరుద్రను.

“పైనాపిల్ కేక్” చెప్పాడు అనిరుద్ర.

“నేనడిగేది టిఫిన్”

“నేను చెప్పేది టిఫిన్ గురించే. నిన్న తెచ్చిన కేక్ ఫ్రిజ్ లో పెట్టాను. ఇవ్వాళ బ్రేక్ ఫాస్ట్ కు అదే. లంచ్ కు వంకాయ ఫ్రై” చెప్పాడు అనిరుద్ర.

“బుద్ధి వున్న వాడెవడైనా కేక్ ను బ్రేక్ ఫాస్ట్గా తింటాడా?” అడిగింది అనిమిష.

“హలో... ఎక్స్ క్యూజ్ మీ... వాయిస్ డౌన్ చేయండి. మన అగ్రిమెంట్లో బ్రేక్ ఫాస్ట్ రోజు విడిచి రోజు నా డ్యూటీ. బ్రేక్ ఫాస్ట్లో ఫలాన ఐటమే ఉండాలని ఏం లేదు. ఏం మొన్న అన్నం తిరగమోత పెట్టి ఇదే బ్రేక్ ఫాస్ట్ అంటే నేను తిన్లెదా? కావాలంటే చెప్పు పైనాపిల్ కేక్ ని కూడా తిరగమోత పెడతాను”

“ఛీ.. ఛీ...” అని బాత్రూమ్లోకి వెళ్లి వెంటనే బయటికొచ్చి, “నాకు వంకాయ వద్దు. టమోటా కర్రీ కావాలి” అంది.

“సారీ... టమోటా నో స్టాక్.... అన్నట్టు కూరలకు డబ్బులిచ్చి వెళ్లు”

“ఏం మొన్ననే ఇచ్చానుగా..”

“టమోటా కేజీ పదహారు. తమరిచ్చింది ఎనిమిది లెక్కన. వంకాయ పన్నెండు. తమరిచ్చింది ఆరు చొప్పున, పచ్చిమిర్చి పద్దెనిమిది. తమరిచ్చింది తొమ్మిది చొప్పున. తమరికి సగం సగం ఇచ్చి, సగం సగం నొక్కడం అలవాటా?” అనిరుద్ర అన్నాడు.

“నాకేం అలవాటు లేదు. మీకే లేకపోతే ధరలు అంతలా మండిపోతున్నాయా? వేరీజ్ బిల్లూ...” అడిగింది దీర్ఘం తీసి మరీ.

“యూ వాంట్ బిల్లూ... నీ హ్యాండ్ బ్యాగ్ కు చిల్లుపడేలా తెస్తాను బిల్లు” కసిగా అనుకున్నాడు అనిరుద్ర.

“సాయంత్రం నేనే తెస్తాను కూరగాయలు. అయినా కేజీల చొప్పున అక్కర్లేదు” అంటూ విసవిసా బాత్రూమ్లోకి వెళ్లింది అనిమిష

***
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 12-11-2018, 06:27 PM



Users browsing this thread: 1 Guest(s)