Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
హైదరాబాద్ కథలు
#3
2.                   థాంక్స్ నాన్నా..
 
 “ఏంటి రఘు. అంతా రెడీయా? ఎన్నింటికి ఫ్లైట్?” అడిగాడు తనతో పాటు పని చేసే కొలీగ్.
“రాత్రి తొమ్మిదికి. ఒక ఆరు గంటలకి ఇంటి నించి బయల్దేరితే సరిపోతుంది. ఇండియాకి వెళ్ళాలంటే ఎంత ఆనందంగా ఉంటదో ఈ ప్రయాణం అంత కష్టంగా ఉంటది.” చెప్పాడు రఘు.
“అవును ఈ మధ్య ఈ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ కూడా చాల టైం పడ్తుంది. మొత్తం ఇండియా వెళ్లేసరికి దాదాపు ౩౦ గంటలు పడుతుంది. నేను వెళ్ళడం కాస్త తగ్గించడానికి ఇది కూడా ఒక కారణం.”
“కానీ, అంత అలిసిపొయ్యి ఉంటామా..ఒక్క సారి ఇండియాలో అడుగుపెడితే చాలు అదంతా మరిచిపోతా నేను.” రఘు కళ్ళల్లో ఒక మెరుపు.
చిన్న నవ్వు నవ్వాడు కొలీగ్. “నేను ఇచ్చిన ప్యాకెట్ పెట్టుకున్నావ్ కదా? ఇండియాలో దిగగానే చెప్పు మా తమ్ముడు ఒచ్చి తీస్కుంటాడు. థాంక్స్ అగైన్. కొంచం బరువు ఎక్కువే, ఐనా తీసుకెళ్తున్నందుకు.”
“ఫరవాలేదు. ఆఫీస్ లో అందరి పాకెట్స్ కలిపి ఒక ౩౦ పౌండ్ల దాకా అయ్యింది. అయినా ప్లేస్ ఉందిలే లగ్గేజ్ లో.”
“మరి ఇంకా ఎందుకు ఉన్నావ్. ఆల్రెడీ ౩ అయ్యింది. లాగించేయ్ ఇంకా.”
“అదే అనుకుంటున్నా. ఇవ్వాళ అసలు పనే చెయ్యలేను. ఎంత సేపున్నా దండగే. ఉంటా మరి.” అని బ్యాగ్ సర్దుకోవడం మొదలు పెట్టాడు.
“ఓకే బాస్. హ్యాపీ జర్నీ. నా స్వీట్ ప్యాకెట్ మాత్రం తేవడం మర్చిపోకు.” అని ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు కొలీగ్.
8 గంటలు కంప్యూటర్ ముందు కూర్చొని పని చెయ్యడం అంటే పెద్ద కష్టమైనదేమి కాదు. ఐనా రోజూ ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఆనందం. అలాంటిది ఈ రోజు ఒక వెయ్యి రెట్లు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ నెల రోజులకిగాని ఆఫీస్ మొహం చూడక్ఖర్లేదు. హాయిగా తన ఊళ్ళో, తన ఇంట్లో, తన వాళ్ళ మధ్యన ఉంటూ, వాళ్ళు పెట్టేవి తింటూ గడిపెయ్యొచ్చు. ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది తెలిసిన వాళ్ళ ఎవ్వరింటికి వెళ్ళినా...
ఇండియాలో ఐటి ఉద్యోగం చేసే చాలా మంది కలలు కనే జీవితం రఘు దెగ్గర అప్పటికే ఉంది. అమెరికాలో చాలా మంచి ఉద్యోగం, ఆఫీస్ కి దెగ్గర్లోనే సొంత ఇల్లు. అందమైన, అర్ధం చేసుకునే భార్య, ఆరంకెల జీతం, తన భార్య కూడా ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇంకో ఆరంకెలు, మొత్తం కలిపి కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువే డబ్బు. వీటి వల్ల దొరకని సంతోషమేదన్నా ఉంటే అది కూడా ఇవ్వడానికి ఒక అయిదేళ్ళ కొడుకు. పేరు అద్విక్. ఇంటర్నెట్ లో వెతికి వెతికి ముద్దుగా పెట్టుకున్న పేరు అద్విక్.
· * *
“ ఏంటి ఇంకా ఇల్లంతా ఇలాగే ఉంది.” వాళ్ళావిడ తలుపు తియ్యగానే ఆశ్చర్యపోయాడు. ఇంకో రెండు గంటల్లో బయల్దేరే ఛాయలు ఎక్కడా లేవు.
“మరేం చెయ్యమంటావ్ . నాక్కూడా ఆఫీస్ నించి రావడం లేటయ్యింది. ఒచ్చినప్పట్నించి మీ పుత్రరత్నం చుక్కలు చూపిస్తున్నాడు.” విసుక్కుంది లక్ష్మి.
పుత్రరత్నం అనే మాట వాడిందంటే వీడు చాలా అల్లరి చేశాడన్నమాట. పాపం వాడు మాత్రం కావాలని చేస్తాడా.
“ఇంతకి ఏమయ్యింది.?”
“వాడి బొమ్మలన్నీ పెట్టాలంట పెట్టెలో. ఆ బాస్కెట్ బాల్ అయితే ఖచ్చితంగా పెట్టాలని అల్లరి చేస్తున్నాడు. అక్కడ దొరుకుతాయి అని చెప్పినా వినట్లేదు... నిన్న అంతా సర్దేద్దాం అని చెప్పినా వినలేదు నువ్వు... రోజూ వాడికి నేర్పే బాస్కెట్ బాల్ కదా నిన్న ఒక్క రోజు మానేస్తే ఏమయ్యేది. ఇప్పుడు చూడండి.”
“సరే సరే. నేను చెప్తా కదా. వాడి బొమ్మలు ఏం పెట్టకు. దండగ. కావాలంటే అక్కడ కొనిస్తా అని చెప్తా లే. వాడింక నిన్ను డిస్టర్బ్ చెయ్యడు. తొందరగా సర్దేయ్యి.” అని లోపలి వెళ్ళాడు.
“వాడు ఇటు పక్క రాడు అంటే మీరు చేసేదేంటో నాకు తెల్సు. అయినా అయిదేళ్ళు కూడా సరిగ్గా లేవు వాడికి అప్పుడే బాస్కెట్ బాల్ ఎందుకంటా. సరిగ్గా పట్టుకోవడమే రావట్లేదు వాడికి. ఇప్పుడు ఎమొస్తుందనీ. ఇంకో అయిదేళ్ళు ఆగు.” మాట్లాడుకుంటూ బట్టలన్నీ పెట్టెల్లో కుక్కేస్తుంది.

“వాడికిష్టం, నాకూ ఇష్టం. నీకెందుకే మధ్యలో కుళ్ళు.” అని కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళాడు.
“ముందు పని అంతా పూర్తి చెయ్యి. పెట్టెలు నీట్ గా సర్దు. మా అమ్మ ఎప్పుడూ అంటుంటది, మీరు ఇల్లు సరిగ్గా పెట్టుకోరు అని.” పక్క గది లోంచి కావాలనే అరిచాడు.
“ఒక్క అరగంట నా జోలికి రాకండి. ఆ తరవాత మీకు, మీ అమ్మగారికి, మీ పక్కింటి పిన్నిగారికి అందరికి నచ్చుతుంది.” అని పనిలో పడిపోయింది.
రఘు కూడా చిన్నప్పుడు బాస్కెట్ బాల్ ఆడింది లేదు. కొడుక్కి నేర్పుతూ తనూ నేర్చుకుంటున్నాడు. వాడికి ఇప్పుడే ఏమొస్తుంది. ఆ చిన్న చేతుల్లో బాల్ నిలబడితే అదే ఎక్కువ. దానికే చాలా ఆనందపడిపోతాడు. చాలా ఓపిగ్గా బాల్ ఎలా పట్టుకోవాలి, ఎలా పరుగెత్తాలి అన్నీ చెప్తాడు. ఆ మురిపెంలో ఎప్పుడు అరగంట అయ్యిందో తెలియలేదు.
“నేను రెడీ, పెట్టెలు రెడీ, ఇల్లు రెడీ, మీరిద్దరే మిగిలింది” అని పిలిచింది లక్ష్మి. ఇద్దరూ గబగబా స్నానం కానిచ్చారు. మొత్తానికి టైంకే బయల్దేరారు. కారెక్కగానే పడుకున్నాడు అద్విక్.
“అబ్బా. ఇప్పుడు 20 గంటలు ఫ్లైట్లో కూర్చోవాలా? అసలే వీపు నొప్పిగా ఉంది” అని నిట్టూర్చాడు రఘు.
“మరి ఎవరు ఆడమన్నారు. కాసేపు పడుకోవచ్చుగా. పెయిన్ కిల్లర్ ఇవ్వనా?” కంగారు పడింది లక్ష్మి.
“ఏమొద్దు. దీనికంటే పెద్ద కష్టం ఫ్లైట్లోనే ఉంటుందని భయం.”
“ఏంటి. ఏడ్చే పిల్లలా?” నవ్వింది లక్ష్మి.
అమెరికా నించి ఇండియా ఒచ్చే ఎవరికైనా తెలిసిన సంగతి ఏంటంటే ప్రతి సారి ఫ్లైట్ లో కనీసం ముగ్గురు పిల్లలైనా గట్టిగా ఏడుస్తుంటారు. వాళ్ళతోనే ప్రయాణం చెయ్యాలి. తప్పదు.
“పెళ్ళి కాకముందు గుర్తుందా లక్ష్మి? మనం అనుకునేవాళ్ళం, మనకు పిల్లలు పుట్టాక ఇలా చెయ్యకూడదు అని. కాని తప్పలేదు. పోయినసారి వెళ్ళినప్పుడు వీడు నరకం చూపించాడు.”
“ఇప్పుడు ఆ భయం లేదులే. కాస్త పెద్దవాడయ్యాడు.” అద్విక్ తల నిమురుతూ అంది లక్ష్మి.
“పైగా ఇక్కడ పిల్లల్ని గట్టిగా ఒక మాట కూడా అనలేం. నాకేమో ఓపిక తక్కువ.”
“అబ్బా.. వీలుంటే ఏదో అన్నట్టు. అసలు వాడు నీ మాట ఎప్పుడయినా వింటాడా. నువ్వే వాడు చెప్పిందల్లా చేస్తావు. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకటి. నేనొక్కదాన్ని ఒకటి.” మూతి ముడుచుకుంది లక్ష్మి.
“కాని ఎందుకు వాడిని ఒక్క మాట కూడా అనవు ఎప్పుడూ. వాడికి కోపం ఒస్తుంది అని భయమా.” మెల్లిగా అడిగింది.
“అలా ఏం లేదు. మొన్ననే ఎప్పుడో కదా తిట్టాను.”
“ఛా. ఎప్పుడు స్వామీ. నాతో మాత్రం అలా ఉండరు. కేవలం వాడితోనే.”
“నీ బొంద.”
“హ్మ్... చిన్నప్పుడు మామయ్య అంటే నీకు భయంగా ఉండేదా. అందుకే అద్విక్ కి అలా అవ్వకూడదని అని అలా చేస్తున్నావా?” చాలా రోజులనించి మనసులో ఉన్న ప్రశ్నని బయటపెట్టింది.
“ఎందుకు. మా నాన్నతో బానే మాట్లాడతా కదా నేను. ఆ డౌట్ ఎందుకు ఒచ్చింది.?”
“ఊరికే అడుగుతున్నా.”
“అంటే చిన్నప్పుడు చాలా భయం ఉండేది. నాన్న ఎప్పుడు నన్ను కొట్టడం అలాంటివి చెయ్యలేదు. కాని నాన్న అంటే ఆ భయం అలా ఉండేది అంతే. అప్పట్లో ఎక్కువ మంది అంతే కదా.”
లక్ష్మి ఏం మాట్లాడలేదు.
ఒక్క నిమిషం ఆగి, “ అది కూడా ఇప్పుడు లేదు కదా. ఒక వయసు ఒచ్చాక నాన్న కూడా ఫ్రీగా ఉండడం మొదలు పెట్టారు.” అన్నాడు.
కారు ప్రయాణం ఫ్లైట్ లోకి మారింది. టేక్ ఆఫ్ అవ్వగానే సరిగ్గా ఎవరో ముగ్గురు పిల్లలు రాగం అందుకున్నారు.
· * *
రఘు వాళ్ళ నాన్న రంగారావు. అమ్మ మీనాక్షి. రఘు చిన్నప్పుడు రంగారావుది క్లర్క్ జాబ్ అయినా గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి పెద్దగా కష్టాలేం లేవు. అలాగని గొప్పగా సుఖపడ్డదీ లేదు. అమ్మ ఇంట్లోనే. మామూలుగా గడిచిపోయింది చిన్నతనం. రంగారావు రిటైర్ అయ్యేనాటికి గజెటెడ్ స్థాయికి ఒచ్చాడు. ఆయనకీ పెద్ద కోరికలేం లేవు. రఘు అమెరికా నించి పంపిన డబ్బుతో ఇక్కడ ఆస్తులు కొంటూ, అమ్ముతూ, ఇల్లు కట్టడం పని చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఆనందంగా.
ఇండియా ట్రిప్ చాల బాగా జరుగుతుంది. అద్విక్ కూడా ఈసారి అందరినీ గుర్తుపడుతున్నాడు. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు. ఇంట్లో వాళ్లకి, చుట్టాలకి దెగ్గరయ్యాడు.
ఒకరోజు ఇంట్లో అందరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా అద్విక్ దృష్టి హాల్ షెల్ఫ్ లోని ఒక షీల్డ్ మీద పడింది. పెద్ద షెల్ఫ్ మధ్యలో చాలా జాగ్రత్తగా అందంగా పెట్టుకున్న షీల్డ్ అది.
“తాతయ్యా ఏంటి ఇది.?”
“అదా. మీ నాన్నకి గుర్తుందేమో అడుగు?” అని రఘు వైపుకి పంపించాడు.
రఘు షీల్డ్ ని చూశాడు. ఇన్ని రోజుల నించి అక్కడే ఉన్నా గమనించలేదు.
“అది మళ్ళీ బయటికి తీశారా? ఎందుకు నాన్నా? అదేదో పెద్ద నోబెల్ ప్రైజ్ లాగ.”
“సరే అదేంటో చెప్పు డాడీ.” రఘు చెయ్యి లాగాడు అద్విక్.
“ఏం లేదు నాన్నా. చిన్నప్పుడు నాకు స్కూల్ లో ఇచ్చారు అంతే.” అని ముగించాడు రఘు.
“అలా చిన్నగా అంటావే రా? అద్విక్, మీ నాన్న మాథెమాటిక్స్ లో మొత్తం స్కూల్ లో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఫస్ట్ ఒచ్చాడు. అందుకే ఇది ఇచ్చారు. స్కూల్ ఫస్ట్ కి ఇచ్చే షీల్డ్ అది. ఆ రోజు నించి మీ డాడీ మారిపోయాడు. ఎంసెట్ ర్యాంక్, ఇంజనీరింగ్.. ఇలా అన్నిట్లో టాప్.” రంగారావు కళ్ళల్లో ఒక గర్వం.
“నిజమా డాడీ?” అద్విక్ కళ్ళు పెద్దవి చేస్కొని అడిగాడు.
“అదేమంత పెద్ద స్కూల్ కాదమ్మా.” అని అద్విక్ ని దెగ్గర తీస్కున్నాడు.
తరవాత తండ్రితో, “నేను అమెరికా వెళ్ళేటప్పుడు దీన్ని అటక మీద పెట్టించాను. మళ్ళీ తీసారా? బాలేదు నాన్నా. పాతది. తీసెయ్యండి ప్లీజ్.”
“నీకది గొప్ప కాకపోవచ్చు రా. మాకు గొప్పే.” అన్నాడు రంగారావు రఘు వైపు ఆప్యాయంగా చూస్తూ...
రఘు ఏమీ మాట్లాడలేదు.
“అరేయ్. ఎవరైనా నీ జీవితంలో ఏం సాధించావు అని నన్ను అడిగితే నేను తడుముకోకుండా చూపించేది నిన్నే. చెప్పేది నీ గురించే.” అని అక్కడినుంచి వెళ్ళిపోయాడు రంగారావు.
· * *
మరుసటిరోజు అద్విక్ రఘు చదువుకున్న స్కూలు చూపించమని అల్లరి చెయ్యడంతో ముగ్గురు బయల్దేరారు. మామూలు బస్తీలో అతి మామూలు స్కూలు. అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. సిటీలో స్కూల్స్ అన్నీ కార్పొరేట్ అయిపొయ్యాయి. డొనేషన్ పెంచేసి సాఫ్ట్ వేర్ ఆఫీస్ లకి దీటుగా తాయారు చేశారు. కాని తను చదువుకున్న స్కూలు అలాగే ఉండడం ఆశ్చర్యం వేసింది. బిల్డింగ్ అలాగే ఉంది కాని చాల పాతపడిపోయింది. చూస్తే పిల్లలు కూడా బాగా తగ్గినట్టున్నారు.
బయట రోడ్డు మీదే కారు పార్క్ చేసి లోపలి వెళ్ళారు. మానేజ్మెంట్ రూం ఎక్కడుందో సరాసరి అక్కడికే వెళ్ళాడు. ప్యూన్ ఉన్నాడు. గుర్తుపట్టడానికి ప్రయత్నించాడు కాని గుర్తురాలేదు రఘుకి. వయసు మాత్రం ఎక్కువే ఉంది అతనికి.
“నేను ఇదే స్కూల్లో చదువుకున్నానండి. పాసయ్యి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలయ్యింది. ఒకసారి చూద్దాం అనిపించి ఒచ్చాను. ప్రిన్సిపాల్ గారు రెడ్డిగారేనా ఇంకా?” సూటిగా పాయింటుకి ఒచ్చేశాడు.
“ఎక్కడ సార్. ఆయన పోయి అయిదేళ్ళయింది.”
“అయ్యో.” ఒక్కసారి మనసు కలుక్కుమని అనిపించింది. ప్రిన్సిపాల్ చేతిలో ఎన్ని సార్లో దెబ్బలు తిన్నాడు. ఒక్కసారి కూడా ఆయన మెచ్చుకున్న క్షణాలు లేవు. ఆయన ఒస్తున్నాడంటేనే పిల్లలందరికీ హడల్. ముందు కొట్టి తరవాత విషయం అడిగే టైపు. కాని ఎందుకో ఇప్పుడు బాధగా అనిపించింది.
“మరి ఇప్పుడు ఎవరు ప్రిన్సిపాల్?”
“ఆయన కూతురు ప్రజ్ఞా మేడమ్. ఆయన పోయినప్పటినించి మేడమే చూసుకుంటున్నారు. లోపలే ఉన్నారు, వెళ్లి కలవచ్చు” అని పంపించాడు.
ప్రిన్సిపాల్ రూం ముందుకెళ్ళి నిలబడ్డాడు. లోపలికి వెళ్ళబుద్ధి కాలేదు.
లక్ష్మిని అద్విక్ ని పిలిచాడు.
“ఇదే రూం ముందు ఎన్ని సార్లు నిలబడ్డానో తెల్సా. క్లాసులు ఎగ్గొట్టి క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాళ్ళం. మా టీచర్ కి తెలిసి పనిష్మెంట్ కోసం ఇక్కడే నిలబెట్టేది. మా ప్రిన్సిపాల్ ఒచ్చి వీర కొట్టుడు కొట్టేవారు.” ఇప్పుడు కూడా అక్కడ ఇద్దరు పిల్లలు నిలబడి ఉన్నారు.
“కాని ఇక్కడ వెయిట్ చేసినంత సేపు విచిత్రమైన పొసిషన్ ఉండేది. లోపల్లో పల భయం, బయటికి మాత్రం అందరం నవ్వేవాళ్ళం.”
ఇప్పుడు లోపలికి వెళ్ళి కొత్త ప్రిన్సిపాల్ ని చూడలనిపించలేదు రఘుకి. ప్యూన్ ని పిలిచాడు.
“నాకు మేడం గారిని డిస్టర్బ్ చేయాలని లేదు. ఊరికే స్కూల్ చూస్తాం అంతే. వెళ్లి చెప్పి రా” అని పంపించాడు.
తను ఇద్దరిని తీస్కోని స్కూల్ లోపలి నడిచాడు. చుట్టూ బిల్డింగు మూడు అంతస్థులది. అన్నీ క్లాసులు, మధ్యలో గ్రౌండు, ఒక వైపుకి స్టేజ్. అంతా అలాగే ఉంది. కాని సిమెంట్ స్టేజ్ పెచ్చులు ఊడిపోయి ఉంది. గోడలు కూడా పాడయిపోయాయి.
“ఇక్కడే మేము ఆడుకునే వాళ్ళం. పీటీ టైం అయితే ఇక్కడ... లేకపోతే పక్క గలీలో ఇంకో గ్రౌండ్ ఉండేది... అక్కడ...” ఉత్సాహంగా చెప్తూ ఉన్నాడు.
“ఏం ఆడేవారు అంతగా.” రఘుని ఎప్పుడూ అంత ఉత్సాహంగా చూడలేదు కాబట్టి ఇంకా కనుక్కోవాలి అనిపించింది లక్ష్మికి.
“ఇంకేంటి..? క్రికెట్.... ఇక్కడ రా” అని గ్రౌండ్ లో ఒక చోటికి తీస్కెళ్ళాడు.
“ఇక్కడ చూడు. ఇక్కడే వికెట్లు పెట్టుకునే వాళ్ళం. చూస్తే ఇప్పటికి పిల్లలు ఇక్కడే ఆడుతున్నట్టునారు.” నిన్ననే గ్రౌండ్ కి ఒచ్చినట్టు సరిగ్గా అక్కడికే తీస్కెళ్ళాడు. నిజమే అనిపించింది.
“ఆ రోజులే వేరు. చాలా అల్లరి చేసేవాడిని. చెప్పా కదా నీకు ఇంతకుముందే” లక్ష్మిని అడిగాడు.
“చెప్పావనుకో. కాని ఇక్కడికొస్తే ఇంత ఎక్సైట్ అవుతావు అనుకోలేదు. తెలిసుంటే ఇంతకు ముందే తెచ్చేదాన్ని.”
“అలా ఏం లేదు. చిన్నప్పటి జ్ఞాపకాలు కదా. మరీ తీపెక్కువ.”
ఇంకా స్కూలంతా తిప్పాడు. తను చదువుకున్నప్పుడు ఉన్న టీచర్లు ఎవరూ ఇప్పుడు లేరని తెలిసింది. రిటైర్ అవ్వడమో, వేరే స్కూల్ కి వెళ్లడమో చేశారు. ఒక అరగంట స్కూల్లోనే గడిపారు.
కాసేపయ్యాక లక్ష్మి అడిగింది, “ఎంత సేపు నువ్వు అక్కడ క్రికెట్ ఆడింది, ఇక్కడ కప్పు గెలిచింది చెప్తావ్, సరిగ్గా క్లాసుకి వెళ్ళింది లేదా. అక్కడ మామయ్యనేమో ఇంట్లో నీకు మాథెమాటిక్స్ లో బోలెడు మార్కులు ఒచ్చాయని షీల్డులు దాచుకుంటున్నారు.” అని కొంటెగా అడిగింది.
“అదా..” ఒక్క క్షణం ఆగాడు. నవ్వు మెల్లిగా కరిగిపోయింది.
“అది తరవాత. నైంత్ క్లాసు నించి. అప్పట్నించి మన రూటే మారిపోయింది. చదువే చదువు. వేరే లోకం లేకుండా పోయింది.” ఒక పది సెకండ్లలో రఘు మొఖం నించి ఆనందం ఎగిరిపోయింది.
“నాన్న క్రికెట్ మానేయించారు. మాథెమాటిక్స్ ట్యూషన్ పెట్టించారు. ఇంక అదే పని.”
“మరీ అంత మార్పా. అంత సడన్ గా ఎలా ఒచ్చింది. బుల్బ్ వెలిగిందా?” కొంచెం నవ్విద్దాం అని ప్రయత్నించింది.
నవ్వాడు రఘు. “అలా అని కాదు. నాకే అనిపించింది. మనమా మిడిల్ క్లాస్ మనుషులం. చదువుకోకపోతే ఇక కష్టం. మనం కాని మన ఫ్యామిలీ కాని పైకి రావడం కష్టం.”
“కరెక్టే. కాని ఎయిట్త్ నించి నైన్త్ వెళ్ళేలోపు ఒక్కసారిగా అలా ఎలా మారిపోయావు?”
“చెప్పేవరకు ఒదిలిపెట్టవన్నమాట. సరే పద వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. దారిలో చెప్తా.”
ముగ్గురూ కారెక్కారు.
“ఓకే. చెప్పింక. ఏదో చెప్తా అన్నావ్.” ఉత్సాహంగా అడిగింది లక్ష్మి.
పెద్ద స్టొరీ స్క్రీన్ ప్లే ఊహించుకోకు. నాకు క్రికెట్ పిచ్చి కదా. రోజూ అదే పని. ఇంట్లో నేమో కంగారపడేవాళ్ళు. నేనేమౌతానో అని. ఒక రోజు మా కాలనీకి, పక్క కాలనీకి మ్యాచ్ జరిగింది. చివరిదాకా నాట్ అవుట్ ఉన్నట్టున్నా నేను. అదే మూడ్ లో హ్యాపీగా ఇంటికొచ్చాను. నాన్న అప్పుడే ఇంటికి ఒచ్చినట్టున్నారు. అలసిపోయి ఉన్నారు. సోఫా మీద కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నారు. నేను ఆకలిగా ఉండి సరాసరి వంటింట్లోకి దూరాను. అమ్మ నా కోసమే ఎదురుచూస్తున్నట్టుంది.
“ఒచ్చావా.. నాన్న నీ గురించే అడుగుతున్నారు. మీ స్కూల్ నించి లెటర్ ఒచ్చింది.” అని చెప్పింది అమ్మ.
మా మాటలకి లేచినట్టున్నారు నాన్న.
“రఘు.. ఇటు రా.” అని పిలిచారు.
లెటర్ తీసి చూపించారు. హాఫ్ ఇయర్లీ మార్కులు. చటుక్కున నాన్న చేతిలోంచి లాక్కొని చూశాను. తెలుగు 70, హిందీ 65, ఇంగ్లీషు 60 మాథెమాటిక్స్ 32, సైన్సు 55 సోషల్ 65. మ్యాథ్స్ లో ఫెయిల్.... నాన్న చిన్నప్పట్నించి మ్యాథ్స్ లో ఛాంపియన్.
నేనేమీ మాట్లాడలేదు. ఒక్క నిమిషం ఆగి నాన్నే అన్నారు.
“ఎగ్జామ్స్ ముందు ఎన్ని సార్లు చెప్పానురా. ఒక దెగ్గర కూర్చొని చదివావా అసలు? నువ్వేం చిన్న పిల్లాడివా? బాధ్యత ఉండాలి కదా. మనమేం డబ్బున్నోళ్ళమా? రేపు నీ బతుకు నువ్వు బతకాలి. అది హ్యాపీగా బతకాలి అంటే ఇప్పుడు చదువుకోవాలి. వేరే దారి లేదు.”
నేనేదో చెప్పబోయాను. నాన్న వినలేదు.
“నిన్ను సంజాయిషీ అడగట్లేదు. ఇలా జరిగితే నీ జీవితం పాడయిపోతుంది అని చెప్తున్నా. ఆ పైన నీ ఇష్టం. ఒక్కటి గుర్తుంచుకో. నీకు ఇవ్వడానికి నా దెగ్గర ఆస్తులేం లేవు. ఇప్పటికైనా ఆటల మీద శ్రద్ధ తగ్గించి చదువు మీద పెంచుకో.” అని అక్కడినించి వెళ్ళిపోయారు.
నాకు చాలా బాధేసింది. నాన్నెప్పుడూ నన్ను తిట్టలేదు. అప్పుడు కూడా నన్ను తిట్టినట్టు లేదు. కాని బాధపడ్డారు. అమ్మ కూడా అదే చెప్పింది. సరే కొంచం కష్టపడి చదువుదాం ఇక నించి అని అనుకున్నాను.
తరవాత కొన్ని రోజులకి మా గలీలో ప్రభాకర్ సార్ దెగ్గర నాకు మ్యాథ్స్ ట్యూషన్ పెట్టించారు. ఆయనా బానే చెప్పేవారు. రోజూ స్కూల్ అయిపోగానే ఇంటికి రావడం, ఇంటికి రాగానే ట్యూషన్ కి వెళ్ళడం. ఇదే సరిపోయింది. నెల దాటింది. క్రికెట్ ఆడలేదు. మనసు ఊరుకోలేదు. నాన్న రోజూ నేనేం చేస్తున్నానో అని కనిపెట్టుకుంటూనే ఉండేవారు.
ఒకరోజు మా స్కూల్ నించి పక్క స్కూల్ కి మ్యాచ్ ఆడుతున్నట్టు తెలిసింది. నన్ను సాయంత్రం గ్రౌండ్ కి రమ్మన్నారు మా టీం వాళ్ళు. ఆ ఒక్కరోజు వెళ్ళి, ఆది సెలెక్ట్ అయితే నెక్స్ట్ సండే వేరే స్కూల్ వాళ్ళతో ఆడొచ్చు. సరే ఇంటికి వెళ్ళి ఈ ఒక్కరోజు ట్యూషన్ వెళ్ళను అని చెప్దాం అని అనుకున్నాను. నాన్న ఇంట్లో లేరు. ఏదో పని మీద బయటికి వెళ్లారంట. అమ్మ కూడా వెళ్ళడానికి రెడీగా ఉంది. నా కోసమే ఎదురుచూస్తుంది. నేను రాగానే తినడానికి ఉన్నవన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, ట్యూషన్ కి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయింది. నాకు చెప్పే అవకాశం రాలేదు అని కాదు, సరే ఎలాగైనా బయటికి వెళ్తున్నారు కదా ఎందుకు లే అని ఊరుకున్నాను. తినేసి నా ఫేవరెట్ బ్యాట్ తీస్కొని బయలుదేరాను.
నెల రోజుల నించి ఆకలి పైన ఉన్నానేమో ఆరోజు చాలా బాగా ఆడాను. ఫోర్లు సిక్సులు హోరేత్తిపోయినయి. అదే ఊపు మీద ఊపు ఇంటికి ఒచ్చాను. అమ్మావాళ్ళు ఒచ్చేసినట్టున్నారు. ఇల్లంతా సైలెంట్ గా ఉంది. టీవీ చప్పుడు కూడా వినబట్లేదు. ఎందుకైనా మంచిది అని నా బ్యాట్ ని బయట డోర్ పక్కనే పెట్టి లోపలి వెళ్ళాను.
చూసేసరికి షాక్. ప్రభాకర్ సార్ ఉన్నారు. నాన్నతో మాట్లాడుతున్నారు. అప్పుడే వెళ్ళడానికి లేచారు. నన్ను చూసి ఏమీ అనలేదు. ఊరికే నవ్వి వెళ్ళిపోయారు అంతే.
నేను ట్యూషన్ కి రాలేదు అని చెప్పారో లేదో. నేను ఇంట్లో చెప్పాలో చెప్పకూడదో అర్ధం కాలేదు. చెప్పినా పెద్దగా ఏమనరు మా ఇంట్లో అని ఒక నమ్మకం. అయినా కొంచం భయం కూడా ఉండింది.
ఆయన వెళ్ళగానే నాన్న అడిగారు.
“నిన్న ఏదో టెస్ట్ పెట్టారంట కదా ప్రభాకర్ సార్.”
“అవును నాన్న. ఫస్ట్ ౩ చాప్టర్స్”
“మరి ఎన్ని మార్కులు ఒచ్చాయి?”
“అది... తెలీదు. ఇంకా ఇవ్వలేదు.”
టేబుల్ మీద ఉన్న పేపర్ తీసి ఇచ్చారు. 20 కి 5 మార్కులు ఒచ్చాయి.
“ట్యూషన్ కి వెళ్ళావా ఇవ్వాళ?”
ప్రభాకర్ సార్ నేను రాలేదు అని చెప్పారో లేదో అర్ధం కాలేదు. రిస్క్ ఎందుకు అని,
“లేదు నాన్న. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారు కదా. ఆయన బయాలజీ బాగా చెప్తారు. ఏవో డౌట్స్ ఉంటే మా ఫ్రిండ్స్ అందరినీ ఇవ్వాళ రమ్మన్నారు. అక్కడికే వెళ్ళాను. మ్యాథ్స్ తో పాటు సైన్స్ కూడా ఇంప్రూవ్ చేస్కోవాలి కదా.”అన్నాను.
“ఏం చేస్తున్నావు రా. నెలరోజుల నుంచీ ట్యూషన్ కి వెళ్తున్నావ్. మార్కులు మాత్రం పెరగట్లేదు. అసలు శ్రద్ధ పెట్టి చదువుతున్నావారా నువ్వు. ఎంతో కొంత మార్పు ఉంటుంది కదా నువ్వు ట్రై చేస్తే.”
“ట్రై చేస్తున్నా నాన్న నేను. ఈసారి చూడండి.”
ఒక్క క్షణం ఆగి చూసేసరికి. గేటు వేసావా అని నన్ను అడుగుతూ బయటికి వెళ్ళారు. అప్పుడే గుర్తొచ్చింది. బయట నా బ్యాట్ ఉంది. ఆయనే వెనకే పరుగెత్తాను. వెళ్ళి చూసేసరికి బ్యాట్ ఆయన చేతిలో ఉంది. చాలా కోపంగా ఉన్నారు. అంతకుముందు నాన్నని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు.
“నీ రూంలో ఉండాల్సిన బ్యాట్ ఇక్కడేం చేస్తుంది?”
నాకేం చెప్పబుద్ది కాలేదు. ఇంకో అబద్ధం ఆడడానికి ధైర్యం చాలలేదు. అలాగే మౌనంగా నిల్చున్నాను.
“ఎన్ని సార్లు చెప్పినా అర్ధం కాదా నీకు? మనమేంటో మన ఫ్యామిలీ ఏంటో, జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకోలేని చిన్న పిల్లోడివి కాదు. నీకోసమే బ్రతుకుతున్నాం రా. మా బాధ అర్ధం చేస్కోవా? బర్త్ డే రోజు అడిగావని పొరపాటున కొనిచ్చాను రా ఈ బ్యాట్. ఆ డబ్బులు ఎలా ఒచ్చాయో ఆలోచించావా?” చాలా గట్టిగా అరిచారు.
“మీకు చెప్దాం అనుకున్నా నాన్న. ఇవ్వాళా ఇంపార్టెంట్ గేమ్ ఉండింది. ఇంటర్ స్కూల్ గేమ్. దానికోసం.... కాని రేపటినించి వెళ్తా నాన్న ట్యూషన్ కి.” అని బతిమాలడానికి ప్రయత్నించాను.
· * *
ఇంత లోపు ఇల్లు ఒచ్చింది. గేటు తీసి కారు లోపల పార్క్ చేసాడు రఘు.
“సరే చెప్పు. ఏం అన్నారు మామయ్యా? ఆత్రుతగా అడిగింది లక్ష్మి.
“ ఏమంటారు. ఈ మెట్టు ఉంది చూశావా? ఇంటి డోర్ ముందు సరిగ్గా మూడో మెట్టు. ఇంకా గుర్తుంది. దీనికేసి బ్యాట్ ను గట్టిగా కొట్టారు.”
ఇంట్లో వాళ్ళు వింటారేమో అని చాలా మెల్లగా మాట్లాడుతున్నాడు రఘు.
“ముందు రెండు సార్లు కొట్టగానే గట్టిగా శబ్దం ఒచ్చింది. ఇంకా అలాగే కొడుతూ పోయారు.మళ్ళీ మళ్ళీ.. చివరికి... రెండు ముక్కలైపోయింది.”
రఘు కళ్ళల్లో సన్నటి నీటి పొర.
“అంతే. నాన్నని అలా చూడడం అదే మొదటి సారి. ఇంకొక్కసారి అలా చూడొద్దు అనుకున్నా..... ఇప్పటివరకు బ్యాట్ కాని బాల్ కాని ముట్టుకోలేదు.”
ఒక్కసారి రఘు దెగ్గరకి ఒచ్చి హత్తుకుంది లక్ష్మి.
“సరేలే లోపలి వెళ్దాం పదా.” నిద్రపోతున్న అద్విక్ ని ఎత్తుకొని లోపలి వెళ్లారు ఇద్దరు.
* *
వెళ్ళేసరికి హాల్ లో కూర్చొని ఉన్నాడు రంగారావు. టివీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. లక్ష్మికి గుండెల్లో ఝల్లుమనింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో అని. అద్విక్ ని లోపల పడుకోబెట్టడానికి వెళ్ళింది.
రఘు నాన్న పక్కన కూర్చున్నాడు.
“స్కూల్ చూసోచ్చాం నాన్నా.... మీకెప్పుడు చెప్పలేదు.... థాంక్స్ నాన్నా .... మీరు కాని నా క్రికెట్ మాన్పించక పోతే ఇవ్వాళ అమెరికాలో ఈ స్టేజిలో ఉండేవాడిని కాదు.” అని టీవీ ఛానల్ మార్చేశాడు రఘు.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హైదరాబాద్ కథలు - by k3vv3 - 30-07-2023, 10:05 AM



Users browsing this thread: 1 Guest(s)