Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 1
శంభల నగరం – 5
సూర్యః ప్రాకారం
 
సూర్యః ప్రాకారంలో వున్న 7 సువర్ణ అశ్వాలను, రథ సారథి అనూరుడిని, రథచక్రాన్ని, మండలాన్ని చుట్టూ తిరిగి పరిశీలిస్తున్నారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
"సూర్యుడు రావటానికి ఇంకా అరగంట సమయమున్నది. దయచేసి సమయాన్ని సూర్యారాధనలోనే గడపండి", అన్నాడు సిద్ధపురుషుడు.
 
సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మ ధరందేవం తం సూర్యం ప్రణమామ్యహం ||
 
ప్రాకారం చుట్టూతా నలు వైపులా ఆదిత్యుని మంత్రము సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది.
 
"స్వామీ మాకు శ్లోకం యొక్క అర్థాన్ని, మరియు సూర్యుని గురించి మేము తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలను చెబితే మీ నోట వినాలని మేము అనుకుంటున్నాము", అని సిద్ధపురుషుణ్ణి అడిగాడు సంజయ్.
 
"సూర్యుడి నుండే సప్త వర్ణాలు వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్న 7 అశ్వాలు 7 రంగులని అర్థం.
 
కశ్యపుడు, అదితికి కలిగిన ద్వాదశ ఆదిత్యులు అంటారు. అందుకే శ్లోకంలో మీకు కశ్యపాత్మజం అని ఉంటుంది. ఒక సంవత్సరంలో వున్న 12 మాసాలలో  ద్వాదశ ఆదిత్యుల శక్తి ఒక్కో మాసంలో ఒక్కోలా ఉంటుంది.
 
ప్రకృతి సూర్యరశ్మి నుండే శక్తిని పొందుతోంది. ప్రకృతి నుండి వచ్చిన ఫల, జల, కందమూలాదులు తింటూ మనం పరోక్షంగా సూర్యుని ద్వారానే ఆహారాన్ని పొందుతున్నాము. ధర్మరాజు సూర్యుడిని నిష్ఠతో ప్రార్థిస్తే   అక్షయ పాత్రను వరంగా పొందాడు. సమస్త ప్రాణికోటికి ఆహారాన్ని, నీటిని ప్రసాదించేది సూర్యభగవానుడే కాబట్టి సృష్టికి మూలం అయ్యాడు. అలా సూర్యుడు సృష్టికర్త బ్రహ్మ అయ్యాడు.
 
వ్యాప్తి చెందినవాడే విష్ణువు అంటారు. అంతటా తన సూర్యప్రభతో వ్యాప్తి చెందినవాడే భాస్కరుడు.
 
ఆదిత్యానామహం విష్ణుః
 
 
జ్యోతిషాం రవి రంశుమాన్
 
అంటే ఆదిత్యులలో వుండే విష్ణువును నేను , వెలిగించే రవిని నేను అని భగవద్గీతలో మనకు శ్రీ కృష్ణుడే స్వయంగా చెప్పాడు.
 
అన్నింటా మంగళాన్ని అనగా శుభాన్ని కలిగించే వాడే శివుడు. మన ప్రతీ ఉదయం సూర్యునితోటే మొదలవుతుంది. సూర్యుని కంటే ముందుగానే  బ్రాహ్మి ముహూర్తంలో  మనం నిద్రలేచి శుచిగా ఆయనను స్వాగతిస్తే అంతకంటే మంగళకరమైన రోజు మరొకటి ఉంటుందా?”, అని అడిగాడు సిద్ధపురుషుడు.
 
"బ్రాహ్మీ ముహూర్తం అనగా ఏది స్వామి?" అని అడిగాడు అభిజిత్.
 
"ఉదయం 3 గంటల నుండి 6 గంటల మధ్యనున్న కాలం", అని బదులిచ్చాడు సిద్ధపురుషుడు.
 
ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంధః ప్రజాపతిః
అని అగస్త్యుడు రాముడికి చెప్పిన ఆదిత్య హృదయంలో మనకు కనిపిస్తుంది. అనగా సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తుల ఆత్మ చైతన్యాన్ని ఒక్క ఆదిత్యునిలోనే  మనం దర్శించుకోవచ్చునని అర్థం.
 
అగ్నిహోత్రంలో ఆహుతులు వెయ్యటం వల్ల అవి శక్తిగా మారతాయి. భూమి మీదున్న జలములన్నీ సూర్యమండలం అనే అగ్నిలో ఆహుతులు అవుతున్నాయి. మళ్ళీ తిరిగి అవి భూమికి సంపదలు ఇస్తున్నాయి. అందుకే సూర్యుడు యజ్ఞ స్వరూపుడు. అగ్నిహోత్ర స్వరూపుడు.
 
ఏష చైవాగ్ని హోత్రంచ ఫలం చైవాగ్ని హోత్రిణాం
అని మనకు ఆదిత్య హృదయంలో అగస్త్యుల వారు చెప్పిన రహస్యమిది.
అగస్త్యుని చేత ఆదిత్య హృదయం ఉపదేశింపబడిన మయూరుడు ప్రేరణతోనే  సూర్య శతకం రాసాడు
 
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్
అన్న సూక్తి మనందరికీ తెలిసినదే.
 
అలాంటి సూర్యుడి గురించి ఎన్నని చెప్పను? ఏమని చెప్పను?
ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆరోగ్య ప్రదాత. ఐశ్వర్య ప్రదాత.
 
సూర్యభగవానుడిని మనం శంభలలో దర్శించుకోగలుగుతున్నాం అంటే మనమెంతటి అదృష్టవంతులమో మీరే అర్థం చేసుకోండి, అంటూ చెప్పటం ముగించాడు సిద్ధపురుషుడు.
 
సూర్యుడే మూడు వేదాలైన ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలకు నిలయం అంటారు. సూర్య మండలాన్ని ఋగ్వేద స్వరూపముగా, సూర్య మండలంలోని పురుషుణ్ణి యజుర్వేద స్వరూపముగా, సూర్యకిరణాలను సామవేద స్వరూపముగా చెబుతారు. ప్రాతః కాల సమయమున ఎందరో ఋషులు శంభలలోని  సూర్యః ప్రాకారానికి
విచ్చేసారు.
 
గంధర్వులు గానం చేస్తున్నారు. వారి స్వరాన్ని సూర్య నామార్చనతో పావనం చేసుకుంటున్నారు. సూర్యుని యందే లీనమైపోయి వారు చేస్తున్న గానం వింటే ప్రాతః కాల సమయమున సూర్యునికి స్వాగతం పలకని మానవజన్మ వృథా అనిపించింది అభిజిత్, అంకిత, సంజయ్ లకు.
 
అప్సరసలు తమ నాట్యముతో తమ సూర్యారాధనను అభివ్యక్తీకరిస్తున్నారు. సూర్యుడి మేలుకొలుపు ఇంత అందంగా ఉంటుందా అనిపించేలా ఉంది వారి నాట్యం. నాట్యాన్ని చూడటానికే శంభలకు సూర్యుడొచ్చాడేమో అన్నట్టు కళ ఉట్టిపడుతోంది నాట్య భంగిమలలో.
 
యక్షులు రథాన్ని ఒక్క చోటికి చేర్చారు. నాగులు రథాన్ని చుట్టుముట్టి ఉన్నారు. రాక్షసులు రథాన్ని వెనుకనుండి తోస్తూ ఉన్నారు. క్రతువు ఋషి సంతానమైన 60,000 మంది వాలఖిల్యులు రథం ముందు నిలిచి సూర్యభగవానుని స్తుతిస్తూ ఉన్నారు. వారు అంగుష్ఠప్రమాణ దేహం కలవారు అనగా బొటనవేలంత పరిమాణంలో ఉంటారు. వేదాలను అభ్యసించిన వారు. బ్రహ్మచారులు. పవిత్రమైన మనసుకలవారు వాలఖిల్యులు.
 
ఇంత మంది సూర్యభగవానుడిని స్తుతిస్తూ ఉండగా  
సూర్యః ప్రాకారం తేజోమయమై దివ్యముగా వెలిగిపోతోంది.
సూర్యభగవానుడు 10 నిమిషాలపాటు అఖండజ్యోతిలా ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్, అంకిత, సంజయ్ లు వారి పాదాలపై మోకరిల్లి భానుతేజానికి ప్రణమిల్లారు.
 
సిద్ధపురుషునికి సూర్యుని యందున్న వీరి భక్తి చూసి ఎంతో ముచ్చటేసింది. ఆయన కూడా వారిలో ఒకడై ప్రభాకరునిలో వున్న విష్ణు శక్తికి తన శిరస్సు వంచి ఏకాంగ నమస్కారం చేసాడు.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 24-03-2024, 05:09 PM



Users browsing this thread: 1 Guest(s)