Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 1
శంభల నగరం – 9
ఇందుః ప్రాకారం
 
ఇందుః ప్రాకారంలోకి అడుగుపెట్టగానే వారికి అమితాశ్చర్యం కలిగింది. భూలోకంలో మనం చూసే పరస్పర విరుద్ధమైన స్వభావం కల జీవులన్నీ ఒకే చోట కలిసి ఉంటున్నాయి ఇక్కడ. పాము-ముంగిస. శునకము-మార్జాలము. సింహము-జింక. ఇలా అన్నీ సాధు స్వభావంతో చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. పైగా వాటి కళ్ళను చూస్తే పాశవిక లక్షణాలు కనిపించకపోగా, దైవీ కాంతులను విరజిమ్ముతున్నాయి.
 
వాటిని అలానే చూస్తూ విస్తుపోయిన అభిజిత్, అంకిత, సంజయ్ లతో సిద్ధపురుషుడు ఇలా అన్నాడు.
 
"  ఇందుః ప్రాకారంలో మనసు చంద్రుని ఆధీనములో ఉంటుంది. చంద్రుడు అంటే భూమి చుట్టూ తిరిగే చంద్రుడు కాదు. భూలోక వాసుల కంటికి కనిపించే చంద్ర రూపం అది. సూర్య మండలం పైన నిజమైన శీతల, జల లక్షణాలు కలిగిన ఒక భూమిక ఉన్నదని చెబుతోంది వేదం. భూమికనే చంద్ర మండలంగా గుర్తించారు మన వేదాలలో. భౌతిక దృష్టికి అందని చంద్రుని రూపం అది అని చెబుతారు. వేద ఋషులు దర్శించిన చంద్ర మండలం అదేఆచంద్రతారార్కం అన్న పదం వినే ఉంటారు. చంద్రుడూ, తారలూ, సూర్యుడు ఉన్నంతవరకూ అని అనటంలో ఉన్న పరమార్థం ఇదే.
 
చంద్రుణ్ణి ప్రార్థిస్తే మనసును నిర్మలంగా, ఎలాంటి చెడు ఆలోచనలు రానివ్వకుండా ఒక సరోవరం వలే ప్రశాంతముగా ఉంచుతాడు. అందుకే భూలోకంలో పరస్పర వైరంతో ఉండే జంతువులు సైతం ఇక్కడ కలిసి మెలసి జీవిస్తాయి.
 
అంతే కాదు, ప్రాకారంలో మీ మనసుకు ఎన్నో పరీక్షలు ఎదురవ్వబోతున్నాయి. అందుకు సంసిద్ధంగా ఉండండి", అని వారిని హెచ్చరించాడా సిద్ధపురుషుడు.
"స్వామి, భూలోకంలో అడవుల్లో మనకు కనిపించే జంతువులన్నీ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదెలా సాధ్యం?" అని అడిగాడు సంజయ్.
 
"భూలోకంలోని మనుషులే ఇక్కడ ముముక్షువులుగా మీకెలా అయితే దర్శనం ఇచ్చారో, ఇదీ అంతే. భూలోకంలో జంతువుగా జన్మించినప్పటికీ జన్మలో చేసిన సాధన వల్ల ఉత్కృష్టమైన స్థితికి చేరుకున్న అన్ని జంతువులూ ఇక్కడ ముముక్షువులలా అవే శరీరాలు ధరించి కేవలం మోక్ష సాధన కోసమే తపించిపోతూ ఉంటాయి. వాటికి మరొక జన్మ అంటూ ఉండదని అర్థం", అన్నాడా సిద్ధపురుషుడు.
 
ఇక్కడున్న సింహాన్ని చూసారా? అది శంభల నగరానికి కేంద్రబిందువు ఐన శక్తి పీఠమునందున్న అమ్మవారికి నిర్వహించే అన్ని పూజలలో  కర్మసాక్షిగా ఉంటుంది. అమ్మవారిని పూజించే రోజున అమ్మకు  వాహనంగా సింహం ఎన్నో సేవలను అందుకుంటుంది, అన్నాడు సైనికులలో ఒకడు.

" సింహం పేరేమిటి?" అని అడిగాడు అభిజిత్.
 
" కేశనామ ", అన్నాడు సైనికుడు.
 
" పేరుకి అర్థం చెప్పగలరా?" అని అడిగాడు అభిజిత్.
 
 
" సింహం యొక్క కేశాలు సుగంధాన్ని వెదజల్లే మూలికలలా ఉంటాయి. ఎలాంటి దుష్ట పీడిత శక్తి దరిచేరకుండా ఉండటానికి  చింతామణి గృహమునందు  సింహ కేశాలను నీటితో కలిపి ప్రోక్షణ కూడా చేస్తారు. అంతటి ఓషధీ శక్తి ఉన్నదా కేశాలకు", అని వివరించాడు సైనికుడు.
అక్కడి నుండి అభిజిత్, అంకిత, సంజయ్ లు ముందుకు వెళుతూ ఉన్నారు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు మాత్రం అక్కడే ఆగిపోయారు. అభిజిత్, అంకిత, సంజయ్ లు వెనక్కి తిరిగి చూసారు.
 
అప్పుడు ఇద్దరు సైనికులు, "మీరు ముందుకు వెళ్ళండి. మేమిక్కడే ఉంటాము", అన్నారు.
 
సిద్ధపురుషుడు,"మీకు అక్కడ ఎదురయ్యే పరీక్షలు ఎంతో విలువైనవి. మీ జీవితాంతం మీరు గుర్తుపెట్టుకోవలసిన ఎన్నో పాఠాలను మీరక్కడ నేర్చుకోబోతున్నారు", అని చెప్పాడు.
 
అసిధారావ్రతం అని రాసి ఉన్న ప్రాంగణంలోకి అడుగుపెట్టారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
 
అక్కడ ఎందరో అందమైన యువతీ, యువకులు జంటగా కనిపించారు. అందమైన దుస్తులు ధరించి, సుగంధ ద్రవ్యాలను వెదజల్లుతూ చేతిలో చెయ్యేసి ఒకరి సాహచర్యాన్ని మరొకరు ఆస్వాదిస్తూ ప్రాంగణం అంతా తిరుగుతున్నారు. వాళ్ళల్లో కొంత మంది ఒకరిని ఒకరు ఆటపట్టిస్తూ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. మరి కొంత మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకొంత మంది నడుస్తూ మౌనంగా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్తూ ఏదో తెలియని అనుభూతితో ఊహాలోకాల్లో విహరిస్తున్నారేమో అన్నట్టుగా కదులుతూ ముందుకెళుతున్నారు.
 
అంతలో అక్కడికి ఒక అందమైన శంఖినీ జాతి స్త్రీ వచ్చింది.
 
"మీ భూలోక వాసులకు ఇక్కడేం పని?" అని కొంటెగా అభిజిత్ వంక చూస్తూ సంజయ్ ని, అంకితని అడిగింది.
 
"శంభల రాజు అనిరుద్ధుల వారి ఆజ్ఞ మేరకు శంభల నగర సందర్శనం చేస్తూ   ఇందుః ప్రాకారానికి వచ్చాము", తడబడుతూ అన్నాడు అభిజిత్.
 
"తను నీ ప్రేయసి కదా", అని అంకితని చూపిస్తూ అభిజిత్ తో నవ్వుతూ అన్నదా శంఖినీ జాతి స్త్రీ.
 
"అవన్నీ నీకెందుకు?" అని పైకి కోపం నటిస్తూ అన్నాడు అభిజిత్.
 
"మంచి అభినయం దాగుంది నీలో. మంచి రసికుడివే కదా", అంటూ అభిజిత్ బుగ్గను చుంబించినది.
 
"ఇదిగో అమ్మాయి, ఇదేం బాగోలేదు.పద్ధతి కాదిది", అన్నాడు అభిజిత్.
 
"నీ ప్రేయసి కోపంగా నన్నే చూస్తోంది", అంటూ గట్టిగా నవ్విందా శంఖినీ జాతి స్త్రీ.
 
"ఇక్కడ ఇంతమంది అందమైన జంటలను చూస్తుంటే నీకేం అనిపిస్తోంది?" అని అభిజిత్ ని అడిగింది శంఖినీ జాతి స్త్రీ.
అభిజిత్ అంకిత వైపు చూసాడు ఏం చెప్పాలి? అన్నట్టు. అంకిత కోపంగా చూసింది.
 
"అబ్బో... అమ్మాయి కనుసైగ చేస్తే గాని తమరి నోటి నుండి ముత్యాల మాటలు రావే?" అంటూ నవ్వింది శంఖినీ జాతి స్త్రీ.
 
"అలా ఏం కాదు. అందమైన జంటలను చూస్తుంటే నాకు కూడా నా కాబోయే భార్యతో ఇలానే చేతిలో చెయ్యేసి కళ్ళతోటే అనుబంధం పెనవేసుకుని నడుస్తూ అలా ముందుకెళ్లాలి అనిపిస్తోంది", అన్నాడు అభిజిత్.
 
అలా అన్నాడో లేదో అక్కడి ప్రాంగణంలో ఒక్క జంట కూడా లేకుండా అందరూ మాయం అయిపోయారు. ఇప్పుడక్కడ అభిజిత్, అంకిత తప్ప ఎవ్వరూ లేరు. సంజయ్ లేడు. శంఖినీ జాతి స్త్రీ కూడా లేదు.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - శంభల నగరం – 8 - by k3vv3 - 28-04-2024, 05:35 PM



Users browsing this thread: 2 Guest(s)