Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 1
శంభల నగరం – 10
శివుని ఆలయం
 
అక్కడ విభూతి ధరించని మోము మనకు కనబడదు. శివ నామస్మరణ చెయ్యని గొంతు మనకు వినబడదు.
 
సుగంధ ద్రవ్యాల నుండి వచ్చే సువాసనలు మైకాన్ని కలిగిస్తాయి. కానీ అక్కడ అణువణువులో ఉన్న భస్మం యొక్క పరిమళాలు మాత్రం మనకు బ్రహ్మ జ్ఞానాన్ని అందిస్తాయి.
 
అక్కడ మాట్లాడితే శివుడు. ఆట ఆడితే శివుడు. పాట పాడితే శివుడు.
 
ఏది చెయ్యాలన్నా అక్కడ శివుడే. ఏదీ చెయ్యకపోయినా అక్కడ శివుడే.
 
అక్కడ అడుగుపెట్టక ముందు వరకూ మనకు కనిపించేదో ప్రపంచం. అడుగుపెట్టాక   శివుడే  ప్రపంచం.
 
మన శిరస్సు పైకెత్తి చూస్తే కానీ కనిపించనంత ఎత్తులో ఉంటాడు శివుడు. హిరణ్యము అనగా మేలిమి బంగారంతో చెయ్యబడ్డ మూర్తీభవించిన  ఈశ్వరత్వము అక్కడ మనకు కనిపిస్తుంది.
 
56 అడుగుల ఎత్తున్న శివుడు తన రెండు కళ్ళనూ మూసివేసి ధ్యానంలో ఉంటాడు. రెండు చేతులనూ  చిన్ముద్రతో ఉంచి పద్మాసనంలో ధ్యానం చేస్తున్న శివుడు అంత ఎత్తులో మనకు కనిపిస్తాడు.
 
అక్కడున్న శివుణ్ణి చూస్తే 56 అడుగుల ఎత్తున్న పరమశివుడే సాక్షాత్తుగా అక్కడికొచ్చి ధ్యానం చేస్తున్నాడు అన్నట్టుంటుంది కానీ శివుని విగ్రహంలా ఎక్కడా అనిపించదు.
 
ఒక దృశ్యం అద్భుతంగా ఉంటే కళ్లప్పగించి చూస్తాం. కానీ శివుని ఆలయములో ఏది చూసినా ఒక అద్భుతమే. అప్పుడు రెప్పార్పకుండా చూస్తాం. రెప్పపాటులేని స్థితినే  అనిమిషత్వం అంటారు. అనిమిషత్వానికున్న మరొక పేరే  ఈశ్వరత్వము. ఈశ్వరత్వమే కాల స్వరూపం. కాలం రెప్పపాటైనా సరే ఆగదు. అలాంటి కాలస్వరూపుడైన శివుణ్ణి మనం చూడాలంటే రెప్పార్పకుండానే చూడాలి. ఎప్పుడు అద్భుతం మన కంటికి అందకుండా పోతుందో అన్న భయం వెంటాడుతూ ఉంటుంది శివుని ఆలయంలో. అంత అద్భుతంగా ఉంటుందక్కడి  శివుని వైభవం.
 
శివునికి ఎదురుగా ఉన్న నంది 26 అడుగుల ఎత్తు ఉంటుంది. నంది కూడా సువర్ణముతోనే రూపకల్పన చేయబడ్డది.
 
శివునికి అభిషేకం జరుగుతున్నప్పుడే అక్కడున్న నందికి కూడా అభిషేకం జరుపుతారక్కడ.
 
ఆలయంలోనే ఒక బంగారు  ఉన్నది. సింహాసనం 36 అడుగుల ఎత్తు ఉంటుంది. అక్కడున్న 56 అడుగుల శివుడికి తగ్గట్టుగా ఉంటుందా సింహాసనం.
 
అక్కడ వాళ్ళ దినచర్య  శివపంచాక్షరితో   మొదలవుతుంది.
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ.... భస్మాంగరాగాయ మహేశ్వరాయ అంటూ మొదలయ్యే శివపంచాక్షరీ స్తోత్రాన్ని వినటం, చూడటం జన్మ జన్మల పుణ్యమే అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ శివపంచాక్షరి చెప్పే సమయానికి ఎందరో యోగులు, దేవతలు, యక్షులు, అఘోరీలు, ముముక్షువులు, నాగసాధువులు ఇలా శంభల నగర ప్రాకారాలలో లేని వారు ఎంతో మంది మనకు కనబడతారక్కడయక్షస్వరూపాయ జటాధరాయ....పినాక హస్తాయ సనాతనాయ అంటున్నప్పుడు డమరుకం మోగుతూ ఉంటుందక్కడ.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లు శివుణ్ణి చూస్తూ మైమరచిపోయి ఉన్నారు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు ఆలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లు నిలబడి శివుణ్ణి తదేకముగా చూస్తూ ఉన్న చోటికి ఒక  నాగసాధువు వచ్చాడు. వీరితో ఇలా అన్నాడు.
 
ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై 
 ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబు 
ఎవ్వడాదిమధ్యలయుండెవ్వడు సర్వంబు తానై యున్నవాడెవ్వడు  వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్”
మీరే పని మీద ఇక్కడికొచ్చారో నాకు తెలుసు. మీరు కోరుకునే ప్రపంచ శాంతి కోసమే మేమిక్కడ రోజూ శివునికి పూజలు చేస్తున్నాము. శంభల రాజ్యంలో మీరు నేర్చుకునే విద్యలు ఘోర కలిని అంతం చెయ్యటానికి ఉపయోగపడతాయి. కానీ మీకు భవిష్యత్తులో మా నాగసాధువుల అవసరం ఉంటుంది. అందుకే   తాళంచెవిని మీ దగ్గర ఉంచుకోండి, అని చెప్పేసి తాళంచెవిని సంజయ్ చేతికిచ్చి నాగసాధువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
 
నాగసాధువు వెళ్తున్న వైపే ఆశ్చర్యంగా చూసారు అభిజిత్, అంకిత, సంజయ్ లు ముగ్గురూ.
 
అంతలో అక్కడికి ఒక ముముక్షువు వచ్చాడు.
 
"ఇక్కడి శివాలయ చరిత్ర ఏంటో మీకు తెలుసా?" అని అడిగాడు.
 
"తెలీదు స్వామి", అన్నారు ముగ్గురూ ముక్తకంఠంతో.
 
"అయితే మీరు తప్పకుండా తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. శివాలయంలో మీరు చూసే శివుడు శాంతస్వరూపుడు కాడు. సతీదేవి అగ్నికి ఆహుతైన రోజున ఇదే చోట ఆయన  శివతాండవం చేసాడు.
 
 ప్రతీ సంవత్సరం ఒక్కసారి శివతాండవాన్ని చూసే అదృష్టం శంభల నగర వాసులకు దక్కుతుంది. శివ తాండవాన్ని చూడటం అదృష్టమే అయినా చూసి తట్టుకోవటం అంత తేలిక కాదు. ఆయనని అలా చూస్తే కన్నీటి గంగ ధారగా ప్రవహిస్తుంది. మంగళస్వరూపుడైన శివుడేనా ఇలా రుద్ర తాండవం చేస్తోంది అని భయం వేస్తుంది. రోజు ఆయనను శాంతింపచెయ్యటానికి ఇక్కడ స్తోత్రాలు, సూక్తాలు ఎన్నింటినో పఠిస్తారు.
 
ఇక్కడున్న భక్తులకు రోజు నిజమైన పరీక్ష. ఎవ్వరైతే మనసారా శివుణ్ణి ప్రార్థిస్తారో అప్పుడే ఆయన శాంతిస్తాడు. భక్తుని కోరికలను నెరవేరుస్తాడు.
 
ఇక్కడ మీరు చూస్తున్న 56 అడుగుల శివుణ్ణి రూపకల్పన చేసింది  దేవశిల్పి విశ్వకర్మ. సూర్యమండలంలోని సూర్య గణాలు లెక్కలేనంత బంగారాన్ని తెచ్చి ఇచ్చాయి. మేలిమి బంగారంతోనే ఇక్కడున్న శివుణ్ణి, నందిని, సింహాసనాన్ని రూపకల్పన చేసాడు విశ్వకర్మ, అన్నాడా ముముక్షువు.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - శంభల నగరం – 9 - by k3vv3 - 07-05-2024, 07:08 PM



Users browsing this thread: 1 Guest(s)