Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కొత్త ఆవకాయ
#1
కొత్త ఆవకాయ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

“ఏమండీ! మే వచ్చేసింది, రేపు ఆదివారం అయినా మార్కెట్ కి వెళ్ళి ఒక పది మంచి మామిడికాయలు ఆవకాయ కోసం కొట్టించండి, ఒక పది కాయలు మాగాయి కి తీసుకుని రండి, అలాగే పప్పు నూనె ఒక మూడు కేజీలు, త్రి మాంగోస్ కారం కిలో తీసుకుని రండి. యింట్లో ఆవపిండి, ఉప్పు వున్నాయి” అంది శకుంతల, భర్త మురళి తో.


“పప్పు నూనె అంటే కందిపప్పు నూనా, పెసరపప్పు నూనా” అన్నాడు పర్సు చూసుకుంటూ.

“నా బొంద నూనే, ఎక్కడైనా కందిపప్పు నూనె చూసారా? ఏ. ఎస్. బ్రాండ్ పప్పు నూనె అని అడగండి చాలు, వాళ్లే యిస్తారు. కాయలు కొనేటప్పుడు సరిగ్గా చూసుకోండి, పది అడిగితే తొమ్మిది వేస్తారు” అంది.


“సరేలే.. ఈ ఆవకాయ పండుగకు అయిదు వేలు అవుతుందేమో, యింత కష్టపడి ఆవకాయ పెట్టుకోకపోతే కొంప ములగదు కదా, ఆ గాయత్రి కేటరింగ్ వాళ్ళు కొత్త ఆవకాయ అమ్ముతున్నారు, ఒక పావుకేజీ కొనుకుంటే సరి” అన్నాడు భార్యతో మురళి.


“పిల్లలకైనా తలో సీసాలో పెట్టి కొత్త పచ్చడి పంపకపోతే, పాపం ఆ దేశం కాని దేశంలో ఏమి తింటారు. డబ్బు కావాలంటే నేను యిస్తాను, మీరు అడ్డం పడకండి” అంది శకుంతల.

“డబ్బు నువ్వు యిస్తావా? నీకు ఎక్కడిది” అన్నాడు భర్త.


“మీరు ఇవ్వకపోతే సరేనా, నా పిల్లలు నాకు యిస్తారు” అంది గర్వంగా పిల్లలని తలుచుకుంటూ.

“ఆదివారం రావడానికి యింకా నాలుగు రోజులుంది, నిన్ను చూస్తే ముక్కుతూ మూలుగుతూ వున్నావు. మీ నలుగురు చెలెళ్లకి ఫోన్ చేసి, ‘రేపు ఆదివారం ఆవకాయ పెట్టుకోవాలి, కొద్దిగా వచ్చి సహాయం చెయ్య’మని చెప్పు” అన్నాడు మురళి.


“మా చెల్లెళ్లు ఒక్కళ్ళని పిలిస్తే ఏం బాగుంటుంది, వాళ్ళ భర్తలని కూడా రమ్మంటాను, భోజనం చేసి, ఆవకాయ పెట్టి వెళ్తారు. మగాళ్లు మీరు మేడ మీద కూర్చొని మాట్లాడుకోండి” అంది శకుంతల.


“ఎలాగో అందరిని పిలుస్తున్నావు గా, వాళ్లనే మామిడికాయలు ముక్కలు కొట్టించి తీసుకుని రమ్మను, మీ చెల్లమ్మ మొగుడు ఆవకాయ కాయలు సెలెక్ట్ చెయ్యడం లో దిట్ట ట” అన్నాడు మురళి.

“మీకూ ఈ మధ్య బాగా బద్ధకం ఎక్కువ అయ్యింది. అన్నిపనులు వాళ్ళకి చెప్పితే బాగుండదు” అంది భార్య.


శనివారం నాడే సంచులు, మామిడికాయలు తుడవడానికి తెల్లటి క్లాత్ రడీ చేసి, “ఎండ ఎక్కకుండా వెళ్ళండి మార్కెట్ కి, కావాలంటే మళ్ళీ పడుకోవచ్చు” అంది శకుంతల.


“అబ్బా.. వెధవ గొడవ.. చంపేస్తున్నావు, చెప్పిందే చెప్పి, వెళ్తాలే” అన్నాడు మురళి కోపంగా భార్య తో.


టాబ్లెట్ వేసుకుని మంచం మీద కూర్చున్నాడో లేదో, తన తోడల్లుడు సత్యం ఫోన్.

“ఆ ఏమిటి.. యిప్పుడు ఫోన్ చేసావు” అన్నాడు మురళి.


“ఏమి లేదన్నయ్య, రేపు మేము త్వరగా వస్తాము, నువ్వు కొత్తపల్లి కొబ్బరి, లేదా నాటు కాయలు తీసుకో, రసాలు ముక్క మెత్తగా అయిపోతుంది, అది చెప్పాలని చేసాను” అన్నాడు తోడల్లుడు.


“సర్లే తెస్తాను కానీ, నీ దగ్గర మామిడికాయలు కొట్టే కత్తిపీట వుందిగా, అది తీసుకుని రా, ముక్కలు కట్ చేద్దువుగాని” అన్నాడు మురళి.


‘చచ్చాం రా నాయనా, యిప్పుడు ముక్కలు నా చేత కట్ చేయిద్దామని ప్లాన్ చేసినట్టున్నాడు’ అని మనసులో అనుకుని, “అదెక్కడా వుంది అన్నయ్యా, ఎప్పుడో పోయింది, మార్కెట్ లో కాయకి పదిరూపాయలు యిస్తే చక్కగా ముక్కలు కొట్టిస్తాడు” అన్నాడు సత్యం.


“అలాగే” అన్నాడు మురళి.


"అన్నయ్యా! నువ్వు ఎలాగో మార్కెట్ కి వెళ్తావుగా, అక్కడ పనసపొట్టు దొరుకుతుంది తీసుకుని రా, వదిన బాగా వండుతుంది” అన్నాడు సత్యం.


“ఏదో శాస్త్రం చెప్పినట్టు ‘పగవాడిని పంచాంగం అడిగితే చావుకి ముహూర్తం పెట్టాడుట’. అలా వుంది నీ కోరిక. మీ వదినకి పనసపొట్టు కూర వండగలిగే ఓపిక వుంటే ఆవకాయ పెట్టడానికి మీ సహాయం ఎందుకు అడుగుతుంది. బీరకాయ కూర, కొత్త ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే అమృతం లా వుంటుంది” అన్నాడు మురళి తన తోడల్లుడు సత్యం తో.


“కొత్త ఆవకాయ ఎక్కడిది, పెట్టాలి గా” అన్నాడు సత్యం.


“అదేనయ్యా, ఆవకాయ కలిపిన పళ్లెం లో వేడి వేడి అన్నం వేసుకుని తలో ముద్దా తింటే యింక కావలిసింది ఏముంది, సరే పొద్దేక్కింది, పడుకుంటా, రేపు త్వరగా టిఫిన్ తిని వచ్చేయండి. మీరు వచ్చేలోపు నేను కూడా మార్కెట్ నుంచి వచ్చేస్తా” అన్నాడు మురళి.


ఉదయమే బయలుదేరి మార్కెట్ కి వెళ్లిన మురళి కి చెమటలు పట్టాయి. జనం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ కాయలు కొంటున్నారు. కొంతమంది కాయలు కొట్టేవాడిని బ్రతిమాలుతున్నారు తమ మామిడికాయలు ముక్కలు కొట్టి యిమ్మని. నేనే త్వరగా వచ్చానేమో అనుకుంటే ఈ జనం నాకంటే ముందు వచ్చారు అన్నమాట అనుకుని దిక్కులు చూస్తున్నాడు.


ఇంతలో ఒక పండు ముసలాయన పెళ్ళాం తో “వంద కాయలు తీసుకున్నా, చాలా, యింకో పాతిక తీసుకోనా” అని అరుస్తున్నాడు.


వెంటనే మురళి ఆయనతో “అయ్యా! నాకు మొన్నే స్టంట్ వేసారు, ఈ జనం తో నేను స్టంట్ చెయ్యలేను. మీరు తీసుకుందాం అనుకున్న ఆ పాతిక కాయలు మాకు తీసుకోండి” అంటూ చేతిలో వెయ్యి రూపాయలు పెట్టాడు.


పాపం ఆ పెద్దాయన జాలిగా మురళి వంక చూసి, “మీరు అలా కూర్చోండి, నేను తీసుకుంటాను” అని అప్పటికే వంద కాయలు లెక్క పెట్టి సంచిలో వేసి, యింకా ఏ కాయలు కావాలి బాబాయ్ అన్న అతనితో “అవే యింకో పాతిక వెయ్యి” అన్నాడు పెద్దాయన.


బాబోయ్ యిన్ని కాయలు వున్న సంచి ఎలా మోసుకొస్తాడు అనుకుంటున్న మురళి తో “పదండి మా పనిమనిషి సంచి మోసుకుని వస్తాడు, ముందు మీ పాతిక కాయలు ముక్కలు కొట్టించుతాను” అన్నాడు స్పీడ్ గా నడుస్తూ.


‘నా కంటే చాలా పెద్ద, అయినా లేడి లా పరుగు తీస్తున్నాడు’ అనుకుని ఆయన వెనుకే వెళ్ళాడు.

పాపం వాళ్ళావిడ మా పాతిక కాయలు చక్కగా కడిగి తుడిచి ముక్కలు కొట్టించి యిచ్చింది.

‘కృతజ్ఞతలు సార్’ అంటున్న మురళి తో, “బాబూ! అసలే గుండెకు స్టంట్ వేయించుకున్నాను అన్నారు, ఆవకాయ రెండు పూటలా వేసుకుని తినకండి” అన్నాడు పెద్దాయన.


యింటికి వచ్చేసరికి నలుగురు తోడలళ్ళు, వాళ్ళ భార్యలతో వచ్చేసి వున్నారు.

మురళి చేతిలోనుంచి మామిడికాయల ముక్కల సంచి, మామిడికాయల మూట అందుకున్నారు.

శకుంతల తన రెండవ చెల్లెలుతో కలిసి వంట పనిలో పడ్డారు.. మిగిలిన ఇద్దరు మామిడికాయ ముక్కలు శుభ్రం గా తుడవడం మొదలుపెట్టారు.


అప్పుడే టైమ్ పన్నెండు అయ్యింది. మురళి ఎండలో పడి రావడం వల్ల నీరసంగా వున్నాడు.

“త్వరగా అన్నం పెట్టండి, ఆవకాయ సాయంత్రం పెట్టుకోండి” అంటూ నీరసంగా అరిచాడు.

మొత్తానికి అందరి భోజనాలు అయ్యే సరికి రెండు అయ్యింది.


“అన్నయ్యా! నువ్వు కాసేపు పడుకో, మేము ఆవకాయ పెట్టేసి, వెళ్ళిపోతాము” అన్నాడు సత్యం.

“పర్వాలేదు, ఏదో అయిదు నిముషాలు నిద్ర అంతే, మీరు బయలుదేరే లోపు లేచిపోతాను” అంటూ బెడ్ రూంలో కి వెళ్ళిపోయాడు మురళి.


ఉదయం ఎండలో తిరగడం వల్ల మురళి కి పడుకోగానే మొద్దు నిద్రపట్టేసింది. తిరిగి లేచేసరికి సాయంత్రం ఆరుగంటలయింది. యిల్లు నిశ్శబ్దం గా వుంది.


“ఇదిగో.. వాళ్ళు వెళ్లిపోయారా అప్పుడే” అంటూ వంటగదిలో ఉన్న భార్యని ఆడిగాడు.


“ఆ వెళ్లిపోయారు, మీ కాఫీ స్టవ్ మీద పెట్టాను, వెచ్చపెట్టుకుని తాగండి. నేను టీవీలో రామాయణం చూడాలి, నన్ను ఒక రెండు గంటలు ప్రశాంతం గా టీవీ చూసుకోనివ్వండి” అంది శకుంతల.


“ఏమిటో ఈ రోజు వాకింగ్ సరిగ్గా చెయ్యలేదు’ అనుకుంటూ ఆ గదిలోనుంచి ఈ గదిలోకి, ఈ గదిలోనుంచి ఆ గదిలోకి తిరగసాగాడు. వంటగది లో నుంచి సౌండ్ రావడం తో వెళ్లిచూస్తే కాఫీ గిన్నె కాస్తా మాడిపోయింది.


‘చచ్చాం రా నాయనా, యిప్పుడు తను చూసింది అంటే గొడవ పెడుతుంది’ అనుకుంటూ పట్టకారు తో గిన్నెని పట్టుకుని బయట చెత్త బొట్టలో పడేసాడు.


మేడ మీద గదిలో వాకింగ్ చేస్తున్న మురళి కి ఫోన్లో మెసేజ్ పెట్టింది భార్య, రాత్రికి టిఫిన్ ఏమి తింటారు ఇడ్లీ నా దోశ వెయ్యాలా అని. ‘వెధవ ఇడ్లీ తినను, దోశ తింటా’ అని తిరుగు మెసేజ్ పెట్టాడు.

హాలులో టీవీ శబ్దం రాకపోవడంతో కిందకి దిగి వచ్చాడు మురళి.


భర్త ని చూసి “వచ్చారా, దోశ వేసి యిస్తాను” అంటూ వంట గదికి వెళ్ళింది. సోఫాలో కూర్చుని న్యూస్ చూడటం మొదలుపెట్టాడు.


దోశలోకి పచ్చడి ఏమి వేయమంటారు అంది శకుంతల.

“కొద్దిగా ఆవకాయ వెయ్యి” అన్నాడు.



భార్య వేసిన ఆవకాయ చూసి, “ఇదేమిటి యింత నల్లగా వుంది ఆవకాయ, కొత్త ఆవకాయ వెయ్యి” అన్నాడు.


“కొత్తదా, ఎక్కడ వుంది, ప్రతిసారి ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే చాలు, ‘మిగిలినవన్నీ తీసుకుని వెళ్ళండి, ఎవ్వరికీ కావాలి’ అంటే వచ్చిన వాళ్ళు తలో ప్యాకెట్ కట్టుకుని వెళ్లడం అలవాటు అయ్యింది అన్నిచోట్లా. అదే అలవాటు తో మా వాళ్ళు తలో హార్లిక్స్ సీసా ఆవకాయ పట్టుకుని వెళ్లారు” అంది.


“అంటే మనకి ఏమిలేదా” అన్నాడు మురళి.


“ఉంది ఆవకాయ కలిపిన పళ్లెం” అంది నవ్వుతూ శకుంతల.


“పోనీలెండి పాపం! ఉదయం నుంచి కష్టపడి సహాయం చేసారు. ఆ మాత్రం ఒక సీసా ఆవకాయ రుచికి ఇవ్వకపోతే ఏం బాగుంటుంది, వచ్చే వారం నాలుగు కాయలు కొని ముక్కలు కొట్టించుకుని రండి, ఆలోపు నాకు కొద్దిగా ఓపిక వస్తోంది, చక్కగా ఆవకాయ పెడతాను” అంది శకుంతల.

“చాల్లే, యింకా ఆవకాయ పెట్టక్కర్లేదు, నేను ఆ శంకరం పచ్చళ్ళు దగ్గర నుంచి ఆవకాయ ఒక కేజీ కొంటాను చాలు” అన్నాడు మురళి.


“అతని దగ్గర ఆవకాయ మట్టి కంపు వచ్చింది అన్నారుగా అదివరకు” అంది భార్య.


“పర్వాలేదు, నా పేరు మురళి. మట్టి తినడం అలవాటే” అన్నాడు దోశ తిని, ఆవకాయ డస్ట్ బిన్లో పడేసి.


నాలుగు రోజులు గడిచిపోయాయి. కాఫీ తాగుతున్న మురళి ఫోన్ కి సెక్యూరిటీ గేటు నుంచి ఫోన్ ‘సార్ మీకు ఓలా పార్సెల్ వచ్చింది పంపనా’ అంటూ. ‘పంపు’ అని బయటకు వచ్చి నుంచున్నాడు. ఒక ముప్పై ఏళ్ళ కుర్రాడు మోటార్ బైక్ మీద వచ్చి ఒక కవర్ అందించాడు.


ఏమిటా అని చూస్తే రెండు సీసాల ఆవకాయ. ఒకటి ఆవకాయ, ఒకటి పెసర ఆవకాయ. ఆనంద్ నగర్ తోడల్లుడు పంపించాడు. చిన్న స్లిప్ లో ‘మొన్న ఆవకాయ పెట్టాం, రుచి చూసి చెప్పు అన్నయ్య’ అని.


“యిదిగో చూడు మీ చెల్లెలు వాళ్ళు ఆవకాయ పెట్టుకున్నారుట, మనకి పంపించారు” అన్నాడు మురళి భార్య తో.


“అయ్యో! రెండు సీసాల ఆవకాయ పంపింది పాపం, ఎంతైనా దాని చెయ్యి పెద్దది” అంటూ మురిసిపోయింది శకుంతల.


యింకో గంటకి మళ్ళీ సెక్యూరిటీ నుంచి ఫోన్, మోటార్ బైక్ మీద రావడం చేతిలో సంచి పెట్టి వెళ్లిపోవడం, చూస్తే తిరుమలగిరి నుంచి రెండవ తోడల్లుడు ఒక పెద్ద సీసాడు ఆవకాయ పంపాడు, యిలా సాయంత్రం అయ్యేసరికి నలుగురు మరదళ్ళ ఇళ్లనుంచి ఆవకాయ సీసాలు వచ్చాయి, విచిత్రం గా కోఠి నుంచి మురళి తమ్ముడి నుంచి కూడా ఒక ఆవకాయ సీసా వచ్చింది.


శకుంతల సంతోషం గా ఆవకాయ సీసాలు అన్నీ తీసి టేబుల్ మీద పెట్టి, “చూసారా, పాపం వాళ్ళు మన ఆవకాయ పట్టుకుని వెళ్లినా అంతకు రెట్టింపు కొత్త ఆవకాయ పంపించారు” అంది.


“అవును, పోరుగింటి పుల్లకూర రుచి అని మనం పెట్టుకున్న ఆవకాయ వాళ్ళకి రుచి, వాళ్ళ ఆవకాయ మనకి రుచి” అన్నాడు. “సరేలే ఉదయం మిగిలిన అన్నం లో ఆవకాయ కలిపి యివ్వు”, అన్నాడు.


ఆవకాయ అన్నం కంచం వంక చూసి, “అదేమిటి యిప్పుడు మీ వాళ్ళు యిచ్చిన పచ్చడి వెయ్యకుండా మన పాత ఆవకాయ ఎందుకు వేసావు” అన్నాడు అసహనం గా మురళి.

“యిప్పుడు వచ్చిన సీసాలోని పచ్చడే అది, చూడండి, వాళ్ళింట్లో పాత ఆవకాయ మనకి పంపించారు” అంది.


“ఎవ్వరు పంపించారో కూడా తెలియదు అన్నీ సీసాలు ఒకేలా వున్నాయి” అంది.

“ఏడ్చినట్టు వుంది, ముందు మన యింట్లో వున్న పాత ఆవకాయ అంతా ఒక డబ్బాలో వేసి ఇటు తీసుకుని రా, నాకు యిప్పుడు ఏ సీసాలో నుంచి తీసి వేసావో ఆ సీసా కూడా ఇటు తీసుకుని రా” అని అన్నాడు.


సెక్యూరిటీ అతనికి ఫోన్ చేసి ఆవకాయ పచ్చడి వుంది తీసుకుని వెళ్తావా అని అడిగి రమ్మని పిలిచాడు.


పది నిముషాలు లో యిద్దరు సెక్యూర్టీ గార్డ్స్ వచ్చారు. యిద్దరికి చెరొక సీసా యిచ్చి, “కొద్దిగా పాతది. రుచిగానే వుంటుంది” అని యిచ్చేసాడు.


“చూసావా.. వాళ్లయింట్లో పాత ఆవకాయ వదుల్చుకోవడానికి మనకి పంపించారు, కవర్లు పారేసావు. లేకపోతే ఎవ్వరు పంపించారో తెలిసిపోయేది” అన్నాడు.


“మా వాళ్లు అలా చెయ్యరు” అంది శకుంతల.


“అంటే మా తమ్ముడు అలా చేస్తాడా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు” అని భార్యని తిట్టాడు. ఒక గంట మాటలు విసురుకుని విసుగొచ్చి పడుకున్నారు.


రెండవ రోజు వాకింగ్ చేస్తున్న మురళి కి తమ్ముడినుంచి ఫోన్ వచ్చింది అందిందా అంటూ.


“ఒరేయ్! అతి కష్టం మీద రెండు సీసాల పాత ఆవకాయ మిగిలితే నీకు ఒకటి పంపించి ఒకటి నాకు వుంచుకున్నాను. మొన్న డాక్టర్ ఆలీ గారు చెప్పారు కొత్త ఆవకాయ తింటే అరవై దాటిన వాళ్ళకి క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్ రావచ్చు, వాళ్ళకి పాత ఆవకాయ సంజీవిలా పని చేస్తుంది, లోపల ఆరోగ్యకరమైన సెల్స్ ని పెంచి నూరేళ్లు జీవించడానికి అవకాశం వుంటుంది అన్నాడు. మీ మరదలు పని వాళ్ళకి యిస్తాను అంటే తిట్టి, నువ్వు డబ్భై లో కి వచ్చావు కాబట్టి నీకు ఒకటి పంపించాను. రోజూ తిన్నా మంచిదే” అన్నాడు.


‘తమరా అయితే ఆ సీసా పంపింది’ అనుకుని, “సరే ఆ డాక్టర్ గారు చెప్పిన వీడియో పంపు” అన్నాడు తమ్ముడితో.


తమ్ముడు పంపిన వీడియో ని భార్య శకుంతల కి కూడా చూపించి, “యిప్పుడెలా, పాత ఆవకాయ మొత్తం సెక్యూరిటీ వాళ్ళకి యిచ్చేసాం” అన్నాడు.


“మీ తమ్ముడు ఏది చేసిన ఆరోగ్యం దృష్టిలో చేస్తాడు, అనవసరం గా కంగారు పడి యిచ్చేసారు” అంది.


“సరేలే యిప్పుడే ఫేసుబుక్ లో పెడతాను సీసా పాత ఆవకాయకి సీసా కొత్త ఆవకాయ యిస్తాం, ఈ అవకాశం ఆరుగురికి మాత్రమే” అని అన్నాడు నవ్వుతు మురళి.


“అలాగే చెయ్యండి.  అరవై ఏళ్ళు నిండిన వాళ్లు పాత ఆవకాయ తినాలి అంటే కొత్తది పిల్లలు తినవచ్చు కాబట్టి  కొత్త ఆవకాయ వచ్చాక పాకెట్స్ కట్టించి, పిల్లలకి కొరియర్ చేయండి. మనం ఒక సీసా దాచుకుంటే వచ్చే ఏడాది తినచ్చు.


అలాగే మార్కెట్ కి వెళ్ళి పాతిక నిమ్మకాయలు తీసుకుని రండి. నిమ్మకాయ ఊరగాయ పెడతాను” అంది.


“బాబోయ్ నా వల్ల కాదు మళ్ళీ మార్కెట్ కి వెళ్ళటానికి, ఊరగాయ లేకపోతే రోటి పచ్చడితో ఈ ఏడాది గడిపేద్దాం” అన్నాడు మురళి.


 శుభం

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice story  clps
[+] 1 user Likes sri7869's post
Like Reply
#3
కొత్తదైనా, పాతదైనా ఆవకాయ అమృతం పెరుగన్నానికైనా, పప్పన్నానికైనా
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)